దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు | Ponnavolu Sudhakar Reddy to High Court On Chandrababu Scam | Sakshi
Sakshi News home page

దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు

Published Fri, Nov 17 2023 5:19 AM | Last Updated on Fri, Nov 17 2023 8:52 PM

Ponnavolu Sudhakar Reddy to High Court On Chandrababu Scam - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు తదితరులు లూటీ చేసిన డబ్బు మొత్తాన్ని హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ తనకు సంబంధించిన చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా రూ. 10 నోట్లను వినియోగించి కావాల్సిన చోటుకు హవాలా మార్గంలో నిధులను మళ్లించారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా జరిగిన వారి చాటింగ్‌ వివరాలను ఆయన కోర్టుకు వివరించారు.నిధులు మళ్లింపు, డబ్బు జమకు వారి మధ్య కోడ్‌ భాషలో సంభాషణలు జరిగాయని తెలిపారు.

సీమెన్స్‌ ప్రతినిధి మాథ్యూ థామస్‌ అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు వాంగ్మూలం ఇచ్చారని ఆయన కోర్టుకు వివరించారు. 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన సీమెన్స్‌ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక ముందే చంద్రబాబు ప్రభుత్వం రూ. 270 కోట్లను ముందుగానే విడుదల చేసేసిందని, ఈ విషయంలో ప్రతీ దశలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులను విడుదల చేయాలని కోరగానే, ఆ నిధులను విడుదల చేసినట్లు అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ తన నోట్‌ఫైల్‌లో పేర్కొన్నారని, ఇదంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు.

టీడీపీ ఖాతాల్లోకి నిధులు
స్కిల్‌ కుంభకోణం నిధుల్లో కొంత భాగం అంతిమంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో చేరాయని, ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ కోరితే ఆ పార్టీ వర్గాలు ఇవ్వడం లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. సీఐడీ ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కిల్‌ కుంభకోణంపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించి నిధుల దుర్విని­యోగాన్ని ధ్రువీకరించిన శరత్‌ అసోసియేట్స్‌పై ఈ కేసులో నిందితుడైన వికాస్‌ ఖన్వీల్కర్‌తో చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఇండియా వద్ద ఫిర్యాదు చేయించారన్నారు.

ఇలా చేయించడం ద్వారా ఈ కేసులో కీలక సాక్షి అయిన శరత్‌ అసోసియేట్స్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్ని­స్తు­న్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత దర్యాప్తుకు విఘాతం కలిగేలా సుమన్‌ బోస్, ఖన్వీల్కర్‌లు మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వీట­న్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయవద్దని.. ఆ పిటిషన్‌ కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.  

గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు
కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు స్కిల్‌ కుంభకోణంలో సహనిందితుల ద్వారా సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఏఏజీ తెలిపారు. తమ పార్టీ నేతల ద్వారా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్టేట్‌మెంట్లు ఇప్పించడం, పోలీసులపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని వివరించారు. బెయిల్‌ పొందేందుకు వీలుగా తప్పుడు మెడికల్‌ రిపోర్ట్‌ను కోర్టు ముందుంచారని ఆయన తెలిపారు.

తాజా మెడికల్‌ రిపోర్టులో చంద్రబాబు ‘హైపర్‌ట్రోపిక్‌ కార్టియోపతి విత్‌ ఇర్రెగ్యులర్‌ హార్ట్‌ రిథమ్‌’తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారని.. ఇది శుద్ధ అబద్ధమని, ఆ వ్యాధితో బాధపడేవారికి వైద్యులు ఐసీడీ అనే పరికరాన్ని అమరుస్తారని తెలిపారు. ఇదేమీ అసాధారణ వ్యాధి కాదన్నారు. ఆ జబ్బు ప్రభావం ఈసీజీ ద్వారా తెలుస్తుందని, అయితే చంద్రబాబు ఈసీజీలో అలాంటిది ఏమీ లేదని ఆయన వివరించారు. కేవలం బెయిల్‌ కోసం ఈ మెడికల్‌ రిపోర్టును సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చంద్రబాబును ఆదేశించాలని కోరారు. చంద్రబాబును ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనకు కావాల్సిన చోట చికిత్స పొందేందుకు చంద్రబాబుకు అనుమతినివ్వడం ద్వారా ఈ కోర్టు ఓ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందని, రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వారంతా కూడా కోర్టుకొచ్చి తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరే ప్రమాదం ఉందన్నారు.

కోర్టు ఆదేశాలు ఉల్లంఘించేలా వైద్య నివేదికలు
వాస్తవానికి మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో హైకోర్టు పలు షరతులు విధించిందని, చంద్రబాబు వైద్య నివేదికలను రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని వైద్యులను ఆదేశించిందని ఏఏజీ తెలిపారు. అయితే వైద్యులు నేరుగా చంద్రబాబుకే ఆ నివేదికలు ఇచ్చారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా చంద్రబాబు  కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. 

తీర్పు రిజర్వు
సీఐడీ వాదనలకు చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమాధానం ఇచ్చారు. నిధుల మళ్లింపుతో చంద్రబాబునాయుడుకు సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్‌ జరిగిందన్నారు. ఆయన షరతులను ఉల్లంఘించలేదని తెలిపారు. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న సుధాకర్‌రెడ్డి రెండో రోజూ గురువారం తన వాదనలను  కొనసాగించారు.

కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదు..
స్కిల్‌ కుంభకోణంలో సీఐడీ పలు కీలక విషయాలను హైకోర్టు ముందుంచింది. కుంభకోణంలో నిధులను షెల్‌ కంపెనీల ద్వారా ఎలా మళ్లించారు.. వాటిని తిరిగి టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి ఎలా తీసుకొచ్చారు.. డీమానిటైజేషన్‌ సమయంలో డబ్బును ఎలా మార్పిడి చేశారు.. తదితర వివరాలను సీఐడీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచింది. ఈమేర అదనపు కౌంటర్‌ను కోర్టులో దాఖలు చేసింది. 2014 జూన్‌ 1 నుంచి 2018 జూన్‌ వరకు మొత్తం రూ. 65.86 కోట్లు టీడీపికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని సీఐడీ వివరించింది.

అంతేకాక 2016 నవంబర్, 2017 జనవరి మధ్య మొత్తం నగదు డిపాజిట్లన్నీ కూడా రూ. 500, రూ. 1,000 నోట్ల ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించామని సీఐడీ తెలిపింది. డీమానిటైజేషన్‌ను నవంబర్‌ 8న ప్రకటించారని, అందువల్ల ఈ రూ. 500, రూ. 1,000 జమ లావాదేవీలన్నీ కూడా అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయంది. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలేవీ సరిగా లేవని, కేవైసీ నిబంధనలు అసలు పాటించలేదని సీఐడీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఈ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని, తామిచ్చిన నోటీసులకు సైతం సరైన రీతిలో స్పందించడం లేదని వివరించింది. చంద్రబాబు ప్రభావితం చేస్తున్న కారణంగా కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు పెండ్యాల శ్రీనివాస్, షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని విదేశాలకు పారిపోయారని సీఐడీ తన అదనపు కౌంటర్‌లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement