సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు.
హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది.
సీఐడీ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్‌రెడ్డి వివరించారు.
అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ కోరుతున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment