బాబు అండ్‌ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి | Handover All Chandrababu Naidu And Co Cases To CBI And ED, Journalist Filed Petition In AP HC | Sakshi
Sakshi News home page

బాబు అండ్‌ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి

Published Sat, Jul 6 2024 5:23 AM | Last Updated on Sat, Jul 6 2024 11:18 AM

Hand over all Babu and Co cases to CBI and ED

పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదు

ఫలితాల రోజే సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు 

హరీష్‌ కుమార్‌ గుప్తా చర్యలు దౌర్జన్యపూరితం

ఫిర్యాదులపై కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు 

సీనియర్‌ పాత్రికేయుడు తిలక్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

చంద్రబాబు, లోకేశ్, నారాయణలతో సహా 114 మంది ప్రతివాదులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణం, అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలు తదితరాల స్కామ్‌లకు సంబంధించి చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సీనియర్‌ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్‌ కొట్టి బాల గంగాధర తిలక్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 

సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దర్యాçప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను కోర్టు ముందుంచేలా కూడా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, సీబీఐ, ఈడీలను కూడా చేర్చారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తాను వ్యక్తి గత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించారు.

సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు 
‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతి (హెచ్‌ఓఎఫ్‌)గా ఉన్న హరీష్‌ కుమార్‌ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారు. 

అంతేకాక మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరింప చేశారు. కౌంటింగ్‌ జరుగుతుండగానే, ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపొమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’ అని తిలక్‌ తన వ్యాజ్యంలో వివరించారు.

ఆ కేసుల విషయంలో ఉదాసీనత 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఈసీఐఆర్‌ను రిజిష్టర్‌ చేసిందని తెలిపారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్‌ వివరించారు. 

ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యా­ప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవ­రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. 

ఎన్నికల ఫలి­తాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశార­న్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసి­నందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్‌బుక్‌ అంటూ పలువురు అధికారులను వేధిస్తు­న్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణ­నలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement