స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ | AP High Court Delivered Skill Case Chandrababu Bail Petition Judgement | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌

Published Mon, Nov 20 2023 2:13 PM | Last Updated on Mon, Nov 20 2023 4:28 PM

AP High Court Delivered Skill Case Chandrababu Bail Petition Judgement - Sakshi

సాక్షి, గుంటూరు: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది.

ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా.. మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు ఇవాళ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు.

మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపిన హైకోర్టు.. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చవని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని, ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని, కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారని, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని హైకోర్టు పేర్కొంది.  చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ  నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది.

చంద్రబాబు బెయిల్‌ ఆర్డర్‌లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు బెయిల్‌ ఆర్డర్‌ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదని పేర్కొంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్‌ స్కామ్‌ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇది బెయిల్‌ పిటిషన్‌ మాత్రమే కాబట్టి స్కిల్‌ స్కామ్‌ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న హైకోర్టు.. ట్రయల్‌ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయని తెలిపింది. ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను చట్ట ప్రకారం విచారించాలని హైకోర్టు సూచించింది.

కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాలు చూపించడంతో మానవతా కోణంలో ఏపీ హైకోర్టు బాబుకి అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.  

బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు సాగాయిలా.. 

సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ కండిషన్స్‌ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. 

స్కిల్‌ స్కామ్‌ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారు. బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్‌, కన్వేల్కర్‌ మెస్సేజ్‌ల ఆధారంగా డబ్బు హైదరాబాద్‌కు చేరినట్లు తెలిసింది.

స్కిల్‌ స్కామ్‌లో మెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారు.

చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు. 

చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయి. బెయిల్‌పిటిషన్‌పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్‌ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్‌ ఎథిక్స్‌కు విరుద్ధం. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, ఆ పని చేయం. పోలీస్‌ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement