గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం | TDP leader throws deputy mayor sisters family out of house | Sakshi
Sakshi News home page

గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం

Published Mon, Dec 23 2024 3:59 AM | Last Updated on Mon, Dec 23 2024 6:54 AM

TDP leader throws deputy mayor sisters family out of house

డిప్యూటీ మేయర్‌ సోదరి కుటుంబాన్ని ఇంటినుంచి బయటకు గెంటేసిన టీడీపీ నేత

ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు

డైమండ్‌బాబును పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సీఐ

లక్ష్మీపురం: టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతు­న్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్‌ బాబు) సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా­రోడ్డు శాంతినగర్‌ 2వ లైన్‌లో డైమండ్‌ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. 

ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాములూరి రామయ్య, పత్రి ఆనంద్‌మోహన్‌ అనే వారిమధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. 

కాగా.. యనమల విజయ్‌కిరణ్‌ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ నకిలీ దస్తావేజులను సృష్టించి ఆది­వారం మధ్యాహ్నం వజ్రకుమారి, కొడుకు కిరణ్‌­కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించిన మహిళలు నాలుగు ఆటోల్లో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. 

వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటినుంచి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయట పడేసి దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయ్‌కిరణ్‌ అనుచరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకున్నారు. 

ఈవిషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు పట్టాభిపురం సీఐ, వెస్ట్‌ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయ్‌కిరణ్‌ అనుచరులను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబును సీఐ వీరేంద్ర వెళ్లిపోవాలని బలవంతం చేశారు.

 

దీంతో డైమండ్‌బాబు తన సోదరి ఇంటిని కబ్జా చేసిన వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వారందరినీ బయటకు పంపించాలని సీఐ వీరేంద్రను కోరా>రు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరి కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్‌బాబు అనటంతో సీఐ వీరేంద్ర ఆయనను బలవంతంగా జీప్‌ ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. 

సమాచారం తెలుసుకున్న మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఈస్ట్‌ ఇన్‌చార్జి నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాభిపురం స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ జోక్యంతో డైమండ్‌బాబును విడిచి పెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement