Eye surgery
-
కళ్లకు లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ హీరోయిన్‌కి ఏం జరిగిందో తెలిస్తే!
చూపు స్పష్టంగా ఉండేందుకు చాలామంది కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కళ్లాద్దాలు బదులు లెన్స్ ఉపయోగించడం. వీటిని పెట్టుకున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల ఏకంగా కంటి చూపు పోయే పరిస్థితి వస్తుంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. లెన్స్ వల్ల తనకు కళ్లు కనిపించట్లేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'జూలై 17న ఈవెంట్ కోసం ఢిల్లీలో ఉన్నాను. రెడీ అవుతున్న టైంలో లెన్స్ పెట్టుకోగానే ఎందుకు నొప్పిగా అనిపించింది. నిమిష నిమిషానికి బాగా ఎక్కువైపోయింది. దీంతో ఈవెంట్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని మేనేజ్ చేశారు. ఓ సమయంలో నాకేం కనిపించలేదు. అలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. అయితే ఈ నొప్పి తగ్గడానికి 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా పట్టడం లేదు' అని జాస్మిన్ బాసిన్ చెప్పుకొచ్చింది.ఈమె లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాదిలో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన జాస్మిన్.. తెలుగులో 'వేట', 'లేడీస్ & జెంటిల్మన్' మూవీస్ చేసింది. వీటితో పాటు బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) -
బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే
సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు. హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. సీఐడీ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్‌రెడ్డి వివరించారు. అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ కోరుతున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు. -
423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం
నార్వేకు చెందిన ఫుట్‌బాలర్ ఒమర్ ఎలాబ్దెల్లౌయి జీవితం అందరికి ఆదర్శప్రాయం. మానసికంగా గట్టిదెబ్బ తగిలినప్పటికి తన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ప్రమాదవశాత్తూ ఒక కన్ను కోల్పోయి 423 రోజుల పాటు తనకు ఇష్టమైన ఆటకు దూరంగా ఉండిపోయాడు. దాదాపు 11 సర్జరీల అనంతరం కంటిచూపు తిరిగి వచ్చింది. తాజాగా మళ్లీ ఫుట్‌బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టి తన కలను సాకారం చేసుకున్నాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ డిసెంబర్ 31,2020.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఒమర్ తనవాళ్లతో క్రాకర్స్ కాలుస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. పొరపాటున ఒక క్రాకర్ అతని కంట్లోకి దూసుకెళ్లింది. అంతే నొప్పితో విలవిల్లలాడిన ఒమర్.. ''నేను చూడలేకపోతున్నా'' అంటూ పక్కనున్న వాళ్లతో చెప్పాడు. వెంటనే ఓమర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఎడమ కన్ను బాగా దెబ్బతిందని.. కంటిచూపు రావడం కష్టమేనని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఒమర్ ఎలాబ్దెల్లౌయి ఫుట్‌బాల్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఒమర్ మనసు అందుకు అంగీకరించలేదు. ఎంత కష్టమైన సరే మళ్లీ ఫుట్‌బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కంటిచూపు కోసం ఎంతో మంది స్పెషలిస్టులను కలిశాడు. చివరగా ఫిబ్రవరి 2021లో సిన్సినాటి ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఒమర్‌కు చిన్న ఆశ కలిగించాడు. ఎడమ కంటిలో స్టెమ్ సెల్స్ దెబ్బతిన్నాయని.. కార్నియాకు ఏం కాలేదని చెప్పాడు. సర్జరీ చేస్తే కంటిచూపు వచ్చే అవకాశముందని పేర్కొన్నాడు. ఒమర్ కంటికి సరిపోయే స్టెమ్ సెల్స్ లభిస్తే.. కాస్త రిస్క్ అయినా ఫలితం వస్తుందని సదరు డాక్టర్ పేర్కొన్నాడు. ఇక్కడే ఒమర్‌కు అదృష్టం తగిలింది. తన కంటికి కరెక్ట్‌గా సరిపోయే స్టెమ్ సెల్స్ దొరకడంతో సర్జరీ విజయవంతమైంది. దాదాపు 11 సర్జీరీల అనంతరం ఒమర్‌కు కంటిచూపు వెనక్కి వచ్చింది. ఆ తర్వాత మరో ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి తన కంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అలా మొత్తానికి 423 రోజుల విరామం అనంతరం మళ్లీ ఫుట్‌బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. గోజ్టేపేతో జరిగిన మ్యాచ్‌లో గలతసరాయ్ తరపున బరిలోకి దిగిన ఒమర్ 90 నిమిషాల పాటు మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో గలతసరాయ్ 3-2 తేడాతో విజయం సాధించి ఒమర్‌కు కానుకగా ఇచ్చారు. కాగా మ్యాచ్‌లో ఒమర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Virat Kohli: అత్యంత పాపులర్ ఆటగాడిగా అరుదైన గౌరవం Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం 😢 Uzun bir aranın ardından formasına kavuşan Omar Elabdellaoui, bitiş düdüğünün ardından gözyaşlarını tutamadı. #GÖZvGS pic.twitter.com/Pu1cnQpwgi — beIN SPORTS Türkiye (@beINSPORTS_TR) February 21, 2022 -
36వేల మందికి పైగా.. అవ్వా తాతలకు కంటి శస్త్రచికిత్సలు
సాక్షి, అమరావతి: అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రారంభమైన అందరికీ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశల్లో స్కూలు పిల్లల కంటి పరీక్షలు పూర్తికాగా.. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన 7,29,266 మందికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించారు. ఇందులో 3,40,535 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడంతోపాటు వారిలో 2,03,483 మందికి వాటిని ఇప్పటికే పంపిణీ చేశారు. అలాగే, 72,416 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా వీరిలో 36,261 మందికి వాటిని నిర్వహించారు. అంటే 50 శాతం పైగా శస్త్ర చికిత్సలను పూర్తిచేశారు. నిజానికి.. రాష్ట్రంలోని 60 ఏళ్లు పైబడిన 56,88,420 మంది అవ్వా తాతలకు ఉచితంగా కంటి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని గత ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలాఖరు నుంచి అవ్వాతాతల కంటి వెలుగు పరీక్షలు నిలిచిపోయాయి. కరోనా ప్రభావం తగ్గడంతో గత ఏడాది నవంబరు 2 నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను తిరిగి ప్రారంభించారు. మిగతా వారికి కూడా వీలైనంత త్వరగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవ్వా తాతలందరికీ కంటివెలుగు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వాసుపత్రులు, ఎన్జీఓ కంటి ఆసుపత్రుల్లో మిగతా వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో అవ్వా తాతలకు కంటి శస్త్ర చికిత్సలను చేయిస్తున్నాం. అలాగే, ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు 230 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించాం. త్వరలోనే మరికొంత మందిని నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. – డా. హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం -
ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదని. అందుకోసం హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అమితాబ్‌కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగింది. తాజాగా ఆయన మరో కంటికి కూడా ఆపరేషన్ విజయవంతంగా పూరయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తెలిపారు. అంతేకాక ‘కంటిశుక్లం చాలా ముఖ్యమైనది. దీని విషయంలో ఎలాంటి ఆలస్యం చేసినా అది అంధత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఆలస్యం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’ అని సూచించారు బిగ్ బీ. ఆపరేషన్ విజయవంతం అయిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడమే కాక.. తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ హిమాన్షు మెహతాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు బిగ్ బీ. ‘‘నా రెండో కంటికి చేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను.. బాగున్నాను. ఆధునిక వైద్య పరిజ్ఞానం.. డాక్టర్ మెహత హస్తవాసి వల్ల ఇది సాధ్యమయ్యింది. ఈ అనుభవం నా జీవితాన్ని మార్చేసింది. గతంలో మీరు చూడలేనిది ఇప్పుడు చూడవచ్చు. ఖచ్చితంగా అద్భుతమైన ప్రపంచం’ అని కొనియాడాతు ట్వీట్ చేశారు. T 3842 - .. and the 2nd one has gone well .. recovering now .. all good .. the marvels of modern medical technology and the dexterity of dr HM 's hands .. life changing experience .. You see now what you were not seeing before .. surely a wonderful world !! — Amitabh Bachchan (@SrBachchan) March 14, 2021 అమితాబ్ బచ్చన్ గత ఫిబ్రవరిలో మొదటిసారి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ‘అభిమానుల ఆందోళన, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. ఈ వయస్సులో కంటి శస్త్రచికిత్స సున్నితమైనది. ఖచ్చితమైన సంరక్షణ అవసరం. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ బ్లాగ్‌లో తెలియజేశారు. శస్త్ర చికిత్స జరిగినందున టైపింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నది. టైపింగ్ తప్పులు జరిగితే క్షమించండి అని చివరన పేర్కొన్నారు బిగ్ బీ. ఇక అమితాబ్ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఇదే కాక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తున్నారు. చదవండి: అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్ గంగారామ్.. నువ్వు సూపర్!: అమితాబ్ -
పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స.!
సాక్షి, సినిమా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ సమస్య పెరగిపోవడంతో పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే పది రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. వారు పవన్ కంటిని పరీక్షించి, ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. శస్త్రచికిత్సతోనే కురుపును తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యులు పవన్ కంటికి శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం పవన్‌ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కు వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తొంది. ఆ మధ్య కొన్ని రోజుల పాటు పవన్ నల్ల కళ్లద్దాల్ని వాడారు. తన కంటి సమస్య గురించి పవన్ తొలిసారిగా రంగస్థలం సక్సెస్ మీట్లో వెల్లడించారు. కానీ ఆ సమస్య ఏమిటన్నది అప్పుడు చెప్పలేదు. ఆ కార్యక్రమంకు ఆయన నల్ల కళ్లద్దాలు పెట్టుకొని వచ్చి, కంటి సమస్యతోనే కళ్లజోడు పెట్టుకున్నానని తెలిపారు. -
సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుధవారం డాక్టర్ సచ్దేవ్ నేతృత్వంలోని వైద్యుల బృందం కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని సీఎం తనయుడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రి కుడి కన్నులోని కాట్రాక్ట్ ఆపరేషన్ విజయవంతమైంది. డాక్టర్ సచ్‌దేవ్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం సీఎం గత శుక్రవారం( సెప్టెంబర్ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో వైద్యులు ఆపరేషన్‌కు కావల్సిన చికిత్సలు పూర్తి చేశారు. Hon'ble CM's Cataract procedure on the right eye completed successfully in Delhi today. Thanks to Dr. Sachdeva — KTR (@KTRTRS) 6 September 2017 -
చీకటి నింపిన శస్త్ర చికిత్స
ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన ఎనిమిది మంది సామర్లకోట: మందగించిన చూపును కాస్త మెరుగు పరుచుకుందామని ఆశించడమే ఆ బడుగు జీవులకు శాపంగా పరిణమించింది. ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకుని ఏకంగా ఎనిమిది మంది కూలీలు చూపునకు దూరమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గంపేటలోని కోడూరి రంగారావు లయన్స్ ఆస్పత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. ఆపరేషన్లు, అద్దాలు అందజేస్తున్నారని కొందరు చెప్పడంతో ఏప్రిల్ 13న వేట్లపాలెంకు చెందిన 50ృ55 ఏళ్ల వయసున్న 10 మంది వెళ్లారు. వీరికి ఆ రోజు పరీక్షలు చేసి, మరుసటి రోజు ఆపరేషన్లు చేసి పంపించారు. ఇంటికి వచ్చిన వారం రోజుల తర్వాత వీరిలో ఎనిమిది మంది.. రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, బావిశెట్టి రాంబాయి, చిట్టూరి సత్యనారాయణ, గొరత రామకృష్ణ, ఇసాక్, పెద్దిరాజు, బొందాడ సత్యారావుల కళ్ల లోంచి నీరు కారడం మొదలైంది. పైగా మంటలు పుట్టడంతో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికే వెళ్లారు. అక్కడ వీరికి చుక్కల మందు వేసి పంపించారు. నీరు కారడం మరింత ఎక్కువ కావడంతో మే నెలలో కూడా ఆస్పత్రికి వెళ్లారు. అదే చుక్కల మందు వాడాలంటూ అక్కడి సిబ్బంది చెప్పి పంపించేశారు. జూన్‌లో పూర్తిగా కళ్లు కనిపించడం మానేశాయి. పైగా కనుగుడ్డులో విపరీతమైన నొప్పి.. నీరు కారడం మరింత పెరిగింది. బాధితుల బంధువులు వెళ్లి ఆస్పత్రి నిర్వాహకులను నిలదీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారిని విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి కంటికి ఇన్ఫెక్షన్ సోకిందని, అందు వల్లే ఎనిమిది మందికి చూపు పోయిందని నిర్ధారించారు. వీరిలో వేట్లపాలేనికి చెందిన కృపారావు, జగ్గంపేట మండలం రాచపల్లికి చెందిన ఇసాక్‌ల కుడికళ్లు కుళ్లిపోవడంతో శస్త్ర చికిత్స చేసి పూర్తిగా తొలగించారు. వీరికి మరో కన్ను కూడా పని చేయడం లేదు. మిగిలిన ఆరుగురికి మందులిచ్చి పంపించేశారు. వీరి కళ్లు కూడా పూర్తిగా కనిపించడం లేదు. ‘ఈ ఆపరేషన్ చేయించుకోక పోయున్నా బావుండు.. గుడ్డి కంటే మెల్ల నయం అనుకుని ముందుకు సాగేటోళ్లం. ఇప్పుడెలా పనులు చేసుకోవాలి.. ఎలా బతకాలి?’ అంటూ బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. -
ఆర్ఎల్ సెలైన్ బాటిల్స్‌ను నిలిపివేయండి
జిల్లా అధికారులకు రాష్ట్ర ఎంఎస్ఐడీసీ అధికారుల ఆదేశాలు 70 వేల బాటిళ్లపై నిషేధం ఆస్పత్రుల్లో ప్రత్యేక కొనుగోళ్లతో రోగులకు సేవలందించాలని సూచన ఎంజీఎం : హైదరాబాద్‌లోని సరోజినీదేవి ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్సలు వికటించడానికి కారణమైన హసీబ్ ఫార్మాసూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆర్ఎల్ సెలైన్ బాటిళ్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయూల అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఐడీసీ) అధికారులు శుక్రవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలోని సెంట్రల్ డ్రగ్ ్సస్టోర్లో 35 వేలు, ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు 17 వేలు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిలో 10 వేలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆర్ఎల్ సెలైన్ బాటిల్స్‌ను నిలిపివేయండి. మరో 10వేల ఆర్ఎల్ (రింగర్ లాక్టిటెట్) సెలైన్ బాటిళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిని రోగులకు అందించకుండా వెంటనే ఆపేయాలని అదేశాలు జారీ చేశారు. రోగులకు స్థానికంగా సెలైన్ బాటిళ్లను కొనుగోలు చేసి వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రులకు అందిస్తున్న అత్యవసర మందులకు ఉపయోగించే బడ్జెట్‌ను దీనికి వాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆర్ఎల్ సెలైన్ బాటిళ్ల బ్యాచ్ నంబర్లు పరిశీలిస్తున్నామని, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు అవసరమైతే స్థానికంగా సెలైన్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు.