జిల్లా అధికారులకు రాష్ట్ర ఎంఎస్‌ఐడీసీ అధికారుల ఆదేశాలు
70 వేల బాటిళ్లపై నిషేధం ఆస్పత్రుల్లో ప్రత్యేక కొనుగోళ్లతో రోగులకు సేవలందించాలని సూచన
ఎంజీఎం : హైదరాబాద్‌లోని సరోజినీదేవి ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్సలు వికటించడానికి కారణమైన హసీబ్ ఫార్మాసూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఆర్‌ఎల్ సెలైన్ బాటిళ్ల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయూల అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఐడీసీ) అధికారులు శుక్రవారం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలోని సెంట్రల్ డ్రగ్ ్సస్టోర్‌లో 35 వేలు, ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు 17 వేలు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిలో 10 వేలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆర్‌ఎల్ సెలైన్ బాటిల్స్‌ను నిలిపివేయండి.
మరో 10వేల ఆర్‌ఎల్ (రింగర్ లాక్టిటెట్) సెలైన్ బాటిళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిని రోగులకు అందించకుండా వెంటనే ఆపేయాలని అదేశాలు జారీ చేశారు. రోగులకు స్థానికంగా సెలైన్ బాటిళ్లను కొనుగోలు చేసి వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రులకు అందిస్తున్న అత్యవసర మందులకు ఉపయోగించే బడ్జెట్‌ను దీనికి వాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆర్‌ఎల్ సెలైన్ బాటిళ్ల బ్యాచ్ నంబర్లు పరిశీలిస్తున్నామని, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు అవసరమైతే స్థానికంగా సెలైన్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నామన్నారు.