సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలిరోజే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడారాయన. అంతేకాదు.. జనం మధ్య తిరగకూడదని, ఆస్పత్రికి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన షరతులనూ ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.
చంద్రబాబుకి ఉన్న అరోగ్య కారణాల రీత్యా మానవతాధృక్పథంతో నాలుగు వారాలపాటు పలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ర్యాలీలో పాల్గొనకూడదని.. మీడియాతో మాట్లాడకూడదు.. కేసు దర్యాప్తును ఏకంగానూ ప్రభావితం చేయకూడదని తీర్పు ఉత్తర్వుల్లో జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు షరతుల్ని చంద్రబాబు లెక్కచేయలేదు. బయటకు రాగానే వెంటనే మీడియాతో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ షరతుల ఉల్లంఘనను సీఐడీ న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. కేవలం కంటి సర్జరీ కోసమే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్ వెంటనే రద్దు అవుతుందని కోర్టు చంద్రబాబును హెచ్చరించింది కూడా.
కోర్టును బాబు తప్పుదోవ పట్టించారు
కోర్టు తీర్పును ఉల్లంఘించిన చంద్ర బాబు బెయిల్ రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగ రాజు కోరుతున్నారు. ఆరోగ్య కారణాలు చూపి, బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ‘‘చంద్రబాబు తనకు రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుపట్టించారు. ఆరోగ్యం బాగోలేదని నాటకాలు ఆడారు. కాబట్టి, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలి. జైలుకు పంపించాలి’’ అని చీకటిమిల్లి మంగరాజు ఒక ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment