సాక్షి, అమరావతి: స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రాష్ట్ర హైకోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కుదరదని తేల్చిచెప్పింది. అలాగే, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని.. ఈ వ్యాజ్యం తేలేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన పిటిషన్, అనుబంధ పిటిషన్ల తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు.. ఈ విషయంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచుతూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ మేర ఉత్తర్వులిచ్చింది. నిజానికి.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం వాదనలు వినిపించేందుకు వీలుగా చంద్రబాబు న్యాయవాదులు వెకేషన్ కోర్టు ముందుంచాలన్న అభ్యర్థనను తెరపైకి తెచ్చారు.
ఇదే సమయంలో.. చంద్రబాబు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకురావడంతో, చట్ట ప్రకారం ఆయనకు జైలులో తగిన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. అంతేకాక.. తదుపరి విచారణ సమయంలో చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందుంచాలని కూడా జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ బెయిల్ పిటిషన్లు ఎప్పుడు విచారణకు వస్తాయి.. ఏ న్యాయమూర్తి ముందు విచారణకు వస్తాయన్న విషయాలు రెండు మూడ్రోజుల్లో తెలిసే అవకాశముంది.
చంద్రబాబుకు చర్మ సమస్యలున్నాయి..
ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ఆరోగ్యస్థితికి సంబంధించిన వైద్య నివేదికలను మెమో రూపంలో కోర్టు ముందుంచామని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు ఆ నివేదికల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు 17ఏపై తీర్పును రిజర్వ్ చేసింది కదా, ఆ తీర్పు ప్రభావం ఈ పిటిషన్లపై ఉంటుంది కదా? అని ప్రశ్నించారు.
కొంతమేర ఉంటుందని, అందుకే తాము ప్రధాన బెయిల్ పిటిషన్‌లో వాదనలు వినిపించడంలేదని, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో వాదనలు వినిపిస్తున్నామని లూథ్రా, దమ్మాలపాటి చెప్పారు. మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచిచూడటం మంచిదన్నారు. ఆ తీర్పు ప్రభావం ఈ వ్యాజ్యాలపై ఉన్నప్పుడు, ఆ తీర్పు కోసం వేచిచూడటంలో తప్పులేదన్నారు.
మధ్యంతర బెయిల్‌ను ‘సుప్రీం’ తోసిపుచ్చింది..
అనంతరం.. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. అందువల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదన్నారు. అసలు చట్టంలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనే లేదని తెలిపారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ.. అదనపు ఏజీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బెయిల్ పిటిషన్ 19న హైకోర్టులో ఉందని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పడంతో తమ మధ్యంతర బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. వైద్య పరీక్షల విషయంలో ఏం చేయాలగమో అది చేస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీనిపై పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. తామే వైద్య పరీక్షలు చేయించి తామే తిరిగి జైలుకు తీసుకొస్తామన్నారు. వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలకు మీకేం అభ్యంతరమని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై తాను అధికారులతో మాట్లాడి చెప్పాల్సి ఉంటుందని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను మ. 2.15 గంటలకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం తరువాత మారిన స్వరం..
తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగా, చంద్రబాబు న్యాయవాదులు వ్యూహాన్ని మార్చారు. మధ్యంతర బెయిల్ సాధ్యంకాదని హైకోర్టు తేల్చిచెప్పడంతో కొత్త అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. మరో న్యాయమూర్తి ముందు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు వీలుగా, తమ బెయిల్, మధ్యంతర బెయిల్ వ్యాజ్యాలను దసరా సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ఏర్పాటయ్యే వెకేషన్ కోర్టు ముందుంచాలని న్యాయమూర్తిని అభ్యరి్థంచారు. దీంతో న్యాయమూర్తి వారి అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించి ఆ మేర ఉత్తర్వులు జారీచేశారు.
మధ్యంతర బెయిల్ కుదరదు
Published Fri, Oct 20 2023 5:02 AM | Last Updated on Fri, Oct 20 2023 2:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment