సాక్షి, కృష్ణా: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారు. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.
లోకేశ్‌దే కీలక పాత్రే...
అయితే.. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది ఏపీ సీఐడీ. అంతకు ముందు క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు లోకేష్‌పై ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు.
ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు వ్యవహారం..
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్‌డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది.
ఒకటి కాదు.. రెండు కాదు..
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి.
లింగమనేని కోసమే..
ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌తో పాటు ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కాంలో క్విడ్ ప్రోకోలో భాగంగా.. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించిన కరకట్ట నివాసాన్ని వ్యక్తిగతంగానే ఇచ్చారు.
కథ నడిపిన ఏ–2 నారాయణ
అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్‌డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment