ఎంత ఇసుక అందుబాటులో ఉంది.. ఎంత ఇసుక తవ్వుతున్నాం.. ఎంతకు అమ్ముతున్నాం.. అనే సమాచారం ఏదీ రికార్డుల్లో చూపించాల్సిన అవసరం లేకుండా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందే ‘ఉచిత ఇసుక విధానం’. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్ర బాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో రూ.10 వేల కోట్లు కొల్లగొట్టింది.
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కొరఢా ఝళిపించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి, సాగించిన ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసింది. ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా బరితెగించి సాగించిన ఇసుక దోపిడీ గుట్టు రట్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నిన పన్నాగం ఆధారాలతోసహా బట్టబయలు అయ్యింది.
2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాక, చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది విభ్రాంతి పరుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా పీతల సుజాత (టీడీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి), ఏ–2గా చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి), ఏ–3గా చింతమనేని ప్రభాకర్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే), ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రి)తోపాటు మరికొందరిని ఏ–5గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 409 రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (డి) రెడ్‌విత్ 13 (2) ప్రకారం అభియోగం నమోదు చేశారు.
అంతులేని బాబు ధన దాహం
పదేళ్ల తర్వాత 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి బరితెగించారు. ఆ క్రమంలో ఆయన కన్ను రాష్ట్రంలో ఇసుక రీచ్‌లపై పడింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడాలని పన్నాగం రచించారు. అందుకోసం 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకువచ్చి, అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆయన ధన దాహం తీరలేదు.
దాంతో మరింతగా బరితెగించి ఇసుక దోపిడీ సాగించేలా వ్యూహం పన్నారు. అందుకోసం ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అనంతరం కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావించారు.
‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలుగానీ, ఆంక్షలు గానీ విధించదు’ అని చెప్పారు. ఈ మేరకు 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకువచ్చారు.
మెమో 3066తో కనికట్టు
► ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు మాయాజాలం చేసి, భారీ అవినీతికి పాల్పడ్డారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో నంబరు 3066’ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు.
► రాష్ట్రంలో సహజ వనరులకు సంబంధించి, అందులో రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆర్థిక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం ఒక మెమో ద్వారా కథ నడిపించడం చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు.
► అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా.. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకువచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి.. అమ్ముకోసాగింది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత.. రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూపొంతూ లేకుండా పోయింది.
► శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఇసుకదోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా, ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు.
► అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహశీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడటం అప్పట్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇది పచ్చ ముఠాల బరితెగింపునకు నిదర్శనం. అంతగా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన తన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అప్పటి సీఎం చంద్రబాబు సమర్థించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు.
టీడీపీ పెద్దల జేబులోకి రూ.10 వేల కోట్లు
2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుపట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్‌మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది.
ఆ ప్రకారం 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది.
ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నిర్భీతిగా నిబంధనలు బేఖాతరు
వేల కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పాల్పడటం ఆయన కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. ఆ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కచ్చితంగా పాటించాలి.
► ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి.
► అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి.
► ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి.
కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ‘ఇసుక విధానం’ కోసం ఈ మూడు విధానాల్లో ఏ ఒక్కటీ పాటించ లేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించ లేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్‌లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment