ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలను పిచ్చోళ్లుగా, ఏమీ ప్రశ్నించలేని అశక్తులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం అందరి కళ్లముందే భారీ మోసానికి పాల్పడే ధైర్యం చేస్తూండటంతో! అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతూంటే ఇప్పటికే ఉచిత ఇసుకను ప్రజలకు దూరం చేసేశారు. తాజాగా ఇసుక రీచ్‌లను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. మరీ ఇంత మోసమా?.
ఇసుక ఉచితంగా దొరక్కపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని భవన నిర్మాణం రంగం కుదేలైందని ఇదే కూటమి నేతలు జగన్ హయాంలో పెడబొబ్బలు పెట్టిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. ఇలాంటి కట్టుకథలు, మాయమాటలు చెప్పి... తాము అధికారంలోకి వస్తే అంతా ఫ్రీ అంటూ హామీలతో ఊదరగొట్టారు కూడా. ప్రజలు కూడా బహుశా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దగ్గరుండి మరీ ఇసుక తవ్వించి ఉచితంగా పంపిణీ చేస్తారు కాబోలు అనుకున్నారు అప్పట్లో. పైసా ఖర్చు లేకుండా ఇళ్ల వద్దకే ఇసుక వస్తుందని భ్రమపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు అమాయక ఆంధ్రులు సంబరపడ్డారు. మాటిచ్చి... తూచ్ మనడంలో చంద్రబాబు దిట్ట అన్నది మాత్రం మరచిపోయారు.
ఏదైతేనేం... టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల సందర్భంగా కలిసికట్టుగా మేనిఫెస్టోనైతే ప్రకటించాయి. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించినా ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీకి కూడా బాధ్యత ప్పకుండా ఉంటుంది. అయితే ఏదో ఒకలా కూటమి అధికారంలోకైతే వచ్చింది కానీ.. అప్పటి నుంచే ఒక్కటొక్కటిగా హామీలకు తిలోదకాలు ఇవ్వడమూ మొదలైంది. ఈ క్రమంలో తాజా అంకమే ఉచిత ఇసుక మాటను ఉట్టికెక్కించడం!
వాస్తవానికి ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇసుక కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం మొత్తమ్మీద ప్రజల అవసరాల కోసం ఏకంగా 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి ఉంచారు కానీ.. అధికారంలోకి వచ్చీ రాగానే కూటమి నేతలు ఈ ఇసుక నిల్వలతో అయినకాడికి బొక్కేశారు. ప్రజలకేమైనా ఇచ్చారా? ఊహూ అస్సలు లేదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలు సొంత జేబుల్లో నింపుకున్నారు. నిల్వలు కరిగిపోవడంతో ఇసుక దొరకడమే గగనమైంది. ఒకానొక సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘ఎవరు కావాలంటే వారు ఇసుక తవ్వుకుని తెచ్చుకోవచ్చు’’ అన్నారు కూడా. టీడీపీ నేతలు స్టాక్‌పాయింట్ల వద్ద పెత్తనం చెలాయిస్తూ ప్రజలను నిలువుగా దోపిడీ చేశారు.
పోనీ ప్రభుత్వమైనా ఉచితంగా ఇస్తున్నదా అంటే అదీ లేదు. సీనరేజీ, జీఎస్టీల పేరుతో పెద్ద మొత్తాల్లోనీ ఫీజులు వసూలు చేస్తోంది. లారీ లోడింగ్ ఖర్చుల సంగతి సరేసరి. జగన్ అధికారంలో ఉండగా అవసరమైన వారికి అవసరమైనంత ఇసుక హేతుబద్దమైన రేటుకు దొరికేది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఇప్పుడు మాత్రం హళ్లికి హళ్లి... సున్నకు సున్నా! గతం కంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి.
మొత్తానికే ఎసరు..
ఇసుక ఉచితంగా లభించడాన్ని విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎకాఎకి మొత్తం పథకానికి మంగళం పాడేందుకు స్కెచ్ వేసినట్టు ఉంది. నదులలోని 108 ఇసుక రీచ్‌లను గంపగుత్తగా ప్రైవేట్ వారికి అప్పగించేలా గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం చేశారు. వీటి ద్వారా డబ్బై లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తారట. అంతేకాదు...రెండు రోజులలోనే ఈ వ్యవహారం మొత్తాన్ని చక్కబెట్టేయాలన్నది ప్లాన్! టెండర్లు పిలవడం, కేటాయింపులు అన్నీ అన్నమాట! సహజంగానే టీడీపీ వారికే టెండర్లు దక్కే ఏర్పాట్లు ఉంటాయి దీంట్లో! సాధారణంగా టెండర్లలో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ కొంత సమయం ఇస్తారు. అలా కాకుండా రెండు రోజుల వ్యవధి మాత్రమే పెట్టడంతోనే ఇందులోని మతలబు ఏమిటన్నది తెలిసిపోతోంది.
ఇసుక రీచ్‌లు ప్రైవేట్ వారికి అప్పగిస్తే వారు అక్రమంగా అమ్మకాలు జరపకుండా ఉంటారా? ఇసుక ఉచిత సరఫరా ఎలాగో చెప్పకుండా, విధి, విధానాలను నిర్ణయించకుండా హడావుడిగా టెండర్లు ఏమిటో? ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వి ప్రభుత్వానికి అందచేస్తే ,అధికారులు ఉచితంగా ఇస్తారా? లేక ప్రైవేటు వ్యక్తులు తమ రీచ్‌లలో ఇసుక తీసుకుని అమ్ముకునే స్వేచ్చ ఉంటుందా? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అయితే ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అమ్ముకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం వేరే స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినా, అక్కడ ఇసుక ఎంతవరకు ఉంటుంది? మొత్తం రీచ్ లన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లాక, ప్రభుత్వం ఎక్కడ నుంచి ఇసుక తెచ్చి ఉచితంగా ఇస్తుంది?.
ఇప్పటికే టీడీపీ నేతలు అనేక రీచ్‌లను దౌర్జన్యంగా ఆక్రమించారని వార్తలు వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా పొరపాటున బిడ్ పొంది రీచ్ కు వెళితే, టీడీపీ నేతలు వారిని బెదిరించి పంపించి వేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఒక టీడీపీ నేత బెదిరింపుల వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. తమ హయాంలో ఏడాదికి రూ.700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ప్రజలకు రెండు, మూడు రెట్ల భారం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇదే తరహాలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక పాలసీ ప్రకటించకుండా దొంగచాటుగా టెండర్లు ఏమిటని ఆయన ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ టైమ్‌లో మొదటి మూడు నెలలు తప్ప, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక దొరికినా, ఇసుక లభ్యం కావడం లేదని, లేదా ఎక్కువ ధర పెట్టవలసి వస్తోందటూ మొసలి కన్నీరు కార్చిన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇసుక ధరలు రెట్టింపైనా అంతా బాగుందన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మోస్తూ, భజన చేస్తూ ప్రజలను మభ్య పెట్టడంలో ఎల్లో మీడియా విశేషంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాడు మీడియా ఇసుక సమస్యకు ఎలా కవరింగ్ ఇచ్చిందో చూడండి. ఆ పత్రికలో 'రీచ్ లలోను కొనుగోళ్లు" అని హెడింగ్ పెట్టి, అదేదో కొత్త సదుపాయం క్రియేట్ చేస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు.
ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే రీచ్ లకు అనుమతులు ఇస్తారని, ఎవరైనా ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అసలు గుట్టు విప్పారు. అంతే తప్ప కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ హామీకి విరుద్ధంగా ఇసుక బేరసారాలు పెట్టారని ఈనాడు మీడియా రాయలేదు. కూటమి మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి తూట్లు పొడిచారని పేర్కొనలేదు. చంద్రబాబుతో పాటు ఈనాడు మీడియా కూడా జనాన్ని ఎంత అన్యాయంగా మోసం చేస్తున్నది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
ఇక మరో మీడియా ఆంద్రజ్యోతి అయితే త్వరలో ప్రైవేటు ఇసుక రీచ్ లు వస్తున్నాయని, మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి తన వంతు బాజా వాయించింది. ఉచిత ఇసుకకు అదనంగా ఇది ఏర్పాటు అని మళ్లీ కవరింగ్ ఇచ్చారు. ఇదేదో గనుల శాఖ ప్రతిపాదించినట్లు రాశారు తప్ప, చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదన్నట్లు మాయ చేసేందుకు యత్నించారు. ప్రజలకు అవసరమైన ఇసుకను ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యమని కూడా ఆంధ్రజ్యోతి ముక్తాయించింది. దీనిని బట్టి ఈ మీడియా ఎంతగా ప్రజలను చీట్ చేయడానికి కృషి చేస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలిసి ఇసుక కొట్టాయని అనుకోవచ్చా!.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment