ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ మరీ చిల్లర రాజకీయాలకు దిగుతున్నట్లు అనిపిస్తోంది. తమ తప్పులను వైఎస్సార్‌సీపీపైకి తోసివేయాలన్న యావతో ఇలా జరగుతున్నట్లు ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత, మూడుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ చిల్లర రాజకీయాలకు తెర తీయడం విచారకరమైన విషయం. విపక్షంలో ఉండగా కూడా ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. వైసీపీపై అనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దుష్ప్రచారానికి దిగడానికే బాబు అండ్ కో ప్రాధాన్యమిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అధికారం పోయినందుకు ఇలా చేస్తున్నారేమో అనుకున్నాం కానీ.. అది దక్కిన తరువాత కూడా పెడధోరణల్లో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు ఇంకొంచెం దిగజారి మరీ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం విజయవాడను వరద ముంచెత్తింది మొదలు.. ఒకవైపు బాధితులు నానా పాట్లు పడుతున్నా వాటిని కాదని.. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై తుచ్ఛ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం వర్గం వారు. బోట్లు కొట్టుకు రావడం వెనుక జగన్ కుట్ర ఉందన్నది పిచ్చి ఆరోపణ కాకపోతే ఇంకేమిటి? వరద బాధితులను సకాలంలో ఆదుకోలేకపోయిన తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారిపై ఎంతటి దారుణమైన ఆరోపణలు చేయడానికైనా చంద్రబాబు వెనుకాడరు. పిల్లనిచ్చిన మామ పైనే ఎన్నో ఆరోపణలు చేసిన విషయం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన ప్లేట్ మార్చి ఉండవచ్చు. అది వేరే విషయం. తరువాతి కాలంలో బాబు తన విమర్శలను వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై ఎక్కుపెట్టారు. ఆయనపై పలు నిందలు మోపేవారు. రాజకీయంగా ఎవరు తనకు ప్రధాన ప్రత్యర్థి అవుతారో వారిపై ఎల్లో మీడియా అండతో విరుచుకుపడటం చంద్రబాబుకు తెలిసిన విద్య.
కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైనా వారిపై అడపదడప చిన్న మాట అనడం మినహా ఘాటైన విమర్శలేవీ లేకపోవడం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో ఓటింగ్ నుంచి తప్పుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించారు కూడా. అదే సమయంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ పై మాత్రం అప్పటి నుంచే నానా రకాల ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేసేందుకు విశ్వయత్నం చేశారు. భవిష్యత్తులో జగన్ గట్టి నాయకుడు అవుతాడని, ప్రజాబలం పొందుతారని ఆయన అప్పుడే ఊహించడం ఇందుకు కారణం. నిప్పుకు గాలి తోడైనట్లు.. బాబు వికృత రాజకీయాలకు రామోజీ రావు, రాధకృష్ణ వంటి మీడియా అధినేతలు మరింత ఆజ్యం పోశారు. అయినా సరే.. అన్ని కుట్రలను తట్టుకని జగన్ అధికారంలోకి రాగలిగారు. ఈ విషయాన్ని సహించలేకే.. జగన్‌పై అధికారంలో ఉన్నన్ని నాళ్లూ ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేసింది.
2024లో వైఎస్ జగన్ అన్యూహ ఓటమి తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు. ఇప్పటికీ ఎల్లో మీడియా, చంద్రబాబులు ఇద్దరూ నిత్యం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికల్లాంటివి ఏవీ లేకుండా బుడమేరు గేట్లను అకస్మాత్తుగా ఎత్తి వేయడం.. ఫలితంగా ముంపునకు గురైన విజయవాడలో బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవడం వంటి తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు పడవలు బ్యారేజీకి కొట్టుకు రావడం జగన్ కుట్ర అన్న నీచ రాజకీయాలకు తెరతీశారు. ప్రకాశం బ్యారేజీకి దూరంగా ఇసుక రీచ్ ల వద్ద ఉన్న బోట్లు వరదల వల్ల కొట్టుకు వచ్చిన విషయాన్ని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామా నాయుడు చెప్పిన విషయం గమనార్హం. పడవలకు లంగరేయకుండా.. ప్లాస్టిక్ తాడుతో కట్టారని వరద ఉధృతికి అవి తెగిపోయి కొట్టుకొచ్చాయని కోటిన్నర విలువైన పడవల విషయంలో ఎవరైనా ఇలా నిర్లక్ష్యంగా ఉంటారా? అని కూడా మంత్రిగారు ప్రశ్నించారు. కాకపోతే ఆ పడవలు వైసీపీ వాళ్లవని ఆరోపించారు. తీరా చూస్తే ఆ పడవల యాజమాని ఉషాద్రి పక్కా తెలుగు దేశం నేతగా తేలింది. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమలకు సన్నిహితుడు అని స్పష్టమైంది. ఆ పడవలకు అనుమతులు కూడా తెలుగుదేశం హయంలోనే లభించాయి. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచాక ఈ పడవల్లోనే విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డునే పడవలకు లంగరు వేస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడు అయిన రామ్మోహన్ టీడీపీ ఎన్నారై నేత జయరాం సోదరుడి కొడుకు.
విశేషం ఏమిటంటే.. టీడీపీకి చెంది ఆలూరు చిన్న పేరు ప్రస్తావించకపోవడం! మిగతా ఇద్దరిని వైసీపీ వర్గీయులుగా ప్రచారం చేశారు. ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీకి కొట్టుకురావడం యాధృచ్చికం అని నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు చెబుతూ వచ్చినా, ప్రభుత్వ నేతల సూచనలతో వారు కూడా కొత్త పల్లవి అందుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజద్రోహం కేసు పెట్టాలని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారట. చంద్రబాబు ఈ గాత్రం ఆరంభించగానే హోంమంత్రి అనిత తదితరులు పల్లవి అందుకుని ఇదే ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికి వరదల వల్ల ఈ బోట్లతోపాటు వందల బోట్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కొన్ని చిన్న బోట్లు బ్యారేజీ స్పిల్ వే నుంచి బయటకు కొట్టుకుపోయాయట. బలమైన ప్లాస్టిక్ తాళ్లు వేయడం కొత్త కూడా కాదని అమరావతి బోటింగ్ క్లబ్ వీటిని సభ్యులకు సరఫరా చేస్తుందని తెలిసింది. అయినాసరే.. చంద్రబాబు మొత్తం విజయవాడలో మునిగిన లక్షలాది మంది బాధలను, తనపై వస్తున్న వైఫల్య విమర్శలను దారి మళ్లించడానికి ఈ కుట్రను ప్లాన్ ను చేసినట్టు ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
చంద్రబాబు వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే బోట్లకు నీలం రంగు ఉంటే అవి వైసీపీవే అని ఆయన చెబుతున్నారు. బోట్లపై నీలం రంగు మీద పసుపు రంగు ఉన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పరు!! టీడీపీ జెండాలతో ఊరేగింపులు జరిగిన విషయాన్ని దాచేస్తారు. బుడమేరు రెగ్యులేటరీ గేటు ఎత్తితే వరద వస్తుందని తెలుసని, హెచ్చరికలు చేసినా, జనం వినిపించుకోరని భావించామని ఒక సీనియర్ అధికారే స్వయంగా చెప్పారు. అంటే బుడమేరు వరద రావడంలో ప్రభుత్వ కుట్ర ఉందని స్పష్టమవుతోంది కదా. దానికి కారణం ఈ నీరు కృష్ణా నదిలోకి వెళితే అక్కడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి మరింత వరద తాకిడి ఉంటుందని, కరకట్ట దాటి అమరావతిని ముంచేత్తుందని భయపడి బుడమేరు వరద సృష్టించారని వైసీపీ ఇప్పటికే ఆరోపించింది. ఇదే వాస్తవమని జనం నమ్ముతున్నారు.
అలాగే ఒక మీడియా అధిపతి పవర్ ప్లాంట్ కు కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి బుడమేరు గేట్లు ఎత్తివేశారన్న ప్రచారమూ ఉంది. మొత్తం వ్యవహరం చూస్తే బుడమేరు వరద మానవ తప్పిదం అని, కుట్ర పూరితం అని ప్రజలు నమ్ముతున్నారని అనిపిస్తోంది. అందుకే సుమారు 60 మంది వరకు మరణించిన ఈ విషాద ఘటనలో చంద్రబాబుపై కేసు పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ డిమాండ్ చేశారు. దాన్ని కప్పిపుచ్చడానికే బోట్ల కుట్ర అంటూ ఒక కల్పిత గాధను ప్రచారం చేశారని విశ్లేషణలు వస్తున్నాయి. కాగా బుడమేరులో అక్రమణలు తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విశేషం.
ముందుగా కరకట్ట మీద తన అక్రమ నివాసాన్ని కూల్చకుండా, వేరేక్కడో నిర్మాణాలు కూల్చుతాం అంటే జనం నవ్విపోరా? విమర్శించారా? పదిరోజుల తర్వాత చంద్రబాబు కలెక్టరేట్ నుంచి తిరిగి తన కరకట్ట ఇంటికి వెళ్లారు. అంటే తన ఇంట్లో చేరిన వరద నీటిని శుభ్రం చేసుకోవడానికి ఆయనకే పది రోజుల పడితే... బుడమేరు వరదల్లో కూరుకుపోయిన విజయవాడలో సామన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక చోట్ల డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని జనం వాపోతున్నారు. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఆహ...ఓహో అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి భజన చేస్తూ జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఇది ప్రజలకు ద్రోహం చేయడం కాదా ? ఇది కుట్ర కాదా?.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment