ప్రతివాదులుగా ఎల్లో మీడియా ప్రతినిధులు | Representatives of Yellow Media as respondents | Sakshi
Sakshi News home page

ప్రతివాదులుగా ఎల్లో మీడియా ప్రతినిధులు

Feb 14 2024 5:42 AM | Updated on Feb 14 2024 5:42 AM

Representatives of Yellow Media as respondents - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతోపాటు కేసు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చినందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ఏసీబీ కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లు, కామెంట్లు పెట్టడంపై దాఖలైన క్రిమినల్‌ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఎల్లో మీడియా చానల్స్‌ టీవీ 5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది.

హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్‌లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్‌ ఎల్‌ఎల్‌సీని ఆదేశించింది. కాగా.. తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ఇప్పటికే తొలగించామని ప్రముఖ ఆన్‌లైన్‌ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్, ఫేస్‌బుక్‌ హైకోర్టుకు నివేదించాయి. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్‌ చేసింది.

ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో పలువురికి ఇంకా నోటీసులు అందచేయాల్సి ఉందని, అందువల్ల నోటీసులు అందజేసేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

పచ్చ సైన్యం అసభ్య, అభ్యంతరకర పోస్టులు 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్‌ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేశారు.

ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్ రెడ్డిని లక్ష్యం చేసుకుంటూ సోషల్‌ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. కులం పేరుతో కూడా వారిని దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది వసంత్‌కుమార్‌ లిఖితపూర్వకంగా అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ దృష్టికి తీసుకొచ్చారు.

అలాగే హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్‌ మీడియాలో పోస్టులు, కామెంట్లు, విమర్శలు చేసిన వారిపై క్రిమినల్‌ ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు.   

ఆ పోస్టులను తొలగించలేదు 
తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ను యూట్యూబ్‌ ఇప్పటికీ తొలగించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిన వెంటనే సామాజిక మాధ్యమ సంస్థలు తమ ఆన్‌లైన్‌ వేదికలపై ఉన్న పోస్టులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందని, ఆ సంస్థ ఆ పని చేయలేదని తెలిపారు.

యూట్యూబ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సజన్‌ పువయ్య వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా కేంద్రం నియమించిన అ«దీకృత అధికారి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే తాము ఆ పోస్టులను తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అసభ్య, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్‌ను ఆదేశించింది. ఎల్లో మీడియా చానళ్లను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.  

టీడీపీ నేతలకు గతంలోనే నోటీసులు 
ఈ లేఖలను వాటితో పాటు జత చేసిన సోషల్‌ మీడియా తాలూకు కామెంట్లు, పోస్టింగ్‌లు, విమర్శలు, దూషణలను పరిశీలించిన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణ, మువ్వా తారక్‌కృష్ణ యాదవ్, రవికుమార్‌ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్‌.చిరంజీవి, చైతన్య కుమార్‌రెడ్డి, ఆనంద్, కిషోర్‌కుమార్‌ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ వ్యాజ్యంపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు టీడీపీ నేతలతో సహా గూగుల్‌ ఇండియా, ట్విట్టర్‌ కమ్యూనికేషన్స్, ఫేస్‌బుక్‌ ఇండియాలతో కలిపి మొత్తం 27 మందికి నోటీసులు ఇచ్చింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement