న్యాయమూర్తులపై పోస్టులు.. 26 మందికి హైకోర్టు నోటీసులు | High Court notices to 26 people | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులపై పోస్టులు.. 26 మందికి హైకోర్టు నోటీసులు

Published Thu, Sep 28 2023 3:38 AM | Last Updated on Thu, Sep 28 2023 3:55 PM

High Court notices to 26 people - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ కుంభ­కో­ణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పలువురు టీడీపీ నేతలు సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది. స్కిల్‌ స్కామ్‌లో అరెస్టయిన చంద్ర­బాబుకు రిమాండు విధించడంతోపాటు, కేసు కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటి­ష­న్‌ను కొట్టేస్తూ తీర్పు­నిచ్చి­నందుకు హై­కోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయా­ధికారిపై పలువురు సోషల్‌ మీడి­యాలో అసభ్య­కర పోస్టులు, కామెంట్లు పెట్టారు.

వీరిపై క్రిమి­నల్‌ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వొకేట్‌ జన­రల్‌ దాఖలు చేసిన పిటి­షన్‌పై న్యాయ­మూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ వ్యా­జ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణతో పాటు మువ్వా తారక్‌ కృష్ణ యాదవ్, రవి­కుమార్‌ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లా­రావు, కళ్యాణి, ఎన్‌.చిరంజీవి, చైతన్య కుమార్‌ రెడ్డి, ఆనంద్, కిషోర్‌ కుమార్‌ తదితరులకు నోటీ­సులు జారీ చేసింది.

గూగుల్‌ ఇండియా, ట్విటర్‌ కమ్యూనికేషన్స్, ఫేస్‌బుక్‌ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించింది. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులు పెట్టిన ప్రతివాదుల ఫేస్‌బుక్‌ అకౌంట్ల అసలు యజమానులను గుర్తించాలని, వారికి నోటీసులు జారీ చేయాలని డీజీపీని ఆదేశించింది. తమ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 25కి వాయిదా వేసింది.

ఏజీ దృష్టికి దుష్ప్రచారం..
స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటి­షన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరి­పిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీని­వాస­రెడ్డి ఆ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయ­మూర్తి జస్టిస్‌ సురేష్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, ఇతరులు సోషల్‌ మీడియాలో అసభ్య­కర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెద్ద ఎత్తున పెట్టారు. వారిని కులం పేరుతో దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది డాక్టర్‌ వసంత్‌ కుమార్‌ లిఖితపూర్వకంగా ఏజీ ఎస్‌.­శ్రీరామ్‌ దృష్టికి తీసుకొచ్చారు.

హైకోర్టు న్యాయ­వాది ఎం,సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను కూడా ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు, కామెంట్లు పెట్టిన వారిపై క్రిమినల్‌ ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఈ లేఖలను పరిశీలించిన ఏజీ శ్రీరామ్‌ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెం­ట్లు చేసిన వారినీ ప్రతివాదులుగా చేర్చారు.

న్యాయవ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేలా..
ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ రాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సంద­ర్భ­ంగా ఏజీ శ్రీరామ్‌ వాద­నలు విని­పి­స్తూ.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ నేప­థ్యంలో సోషల్‌ మీడియాలో న్యాయ­వ్య­వస్థ, న్యాయ­మూర్తులు, న్యా­యా­­ధి­కారి ప్రతిష్టను దిగజా­ర్చేలా పలు­వురు పోస్టిం­గ్‌లు, కామెంట్లు పెట్టారని తెలిపారు. టీవీ చర్చల్లో కూడా అడ్డగో­లుగా మాట్లా­డారని వివరించారు. కోర్టు ప్రతిష్టను దిగజా­ర్చా­ల­న్న దురుద్దేశంతోనే వారం­తా అలా చేశా­రన్నారు.

ఆ పోస్టుల­ను ధర్మా­సనం దృష్టికి తీసుకొ­చ్చారు. గతంలో కూడా న్యాయ­మూర్తుల­పై ఇలాంటి పోస్టు­లు వచ్చిన­ప్పుడు రిజిస్ట్రార్‌ పంపిన లేఖ మేరకు క్రిమినల్‌ ధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతినిచ్చారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు సైతం సుమోటోగా విచా­రణ జరి­పిందన్నారు. ఆ తరువాత ఈ వ్యవహా­రాన్ని హైకోర్టు సీఐడీకి సైతం అప్పగించిందని తెలిపారు. ఏజీ వాద­నలు విన్న ధర్మా­సనం.. ప్రతి­వాదులందరికీ నోటీసు­లు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement