Ramesh Hospitals
-
రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం కోర్టు ధిక్కారమే
సాక్షి, అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఈ నెల 15న తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ సీఐడీపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సీఐడీ అదనపు డీజీ, సీఐడీ మంగళగిరి ఎస్‌హెచ్‌వోలపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) సూచించింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి 15వ తేదీ మధ్యాహ్నం కల్లా నివేదిక అందచేయాలన్న తమ ఆదేశాల అమల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని మెడికల్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును జూన్ 16కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవి.. సుప్రీకోర్టులో విచారణ జరిగి... సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజును తరలించిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వుల పట్ల అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, ఇవి అమలు చేయడానికి వీల్లేని విధంగా ఉన్నాయని చెప్పారు. వీటిని అమలు చేయాలని అధికరణ 226 కింద హైకోర్టు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 54ను ఓసారి చూడాలని, దాన్ని చదివితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఎలా చట్టవిరుద్ధమో అర్థమవుతుందని నివేదించారు. దాంతో తమకు సంబంధం లేదని, తమ ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది మాత్రమే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే వాటిని హైకోర్టులో సవాల్ చేసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘మేం ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశాం’’ అని సుధాకర్‌రెడ్డి వివరించారు. రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలంటూ 15న మేం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. ‘‘రాత్రి 12 గంటలకు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయడం ఎలా సాధ్యం?’’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మీరేం చెప్పాలనుకున్నా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో చెప్పుకోండని ఆమె తేల్చి చెప్పారు. కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చెప్పే విషయాలను నమోదు చేయాలని సుధాకర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఆ అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ లలిత తెలపగా... తన వాదనలు వినేందుకు సిద్ధంగా లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోతానని సుధాకరరెడ్డి చెప్పారు. తన వాదనలు విననప్పుడు తాను ప్రభుత్వం తరఫున హాజరవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. ఇదేదో ప్రత్యేక కేసు అన్నట్టు వ్యవహరించడం సరికాదు న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తామిచ్చిన ఉత్తర్వులను తప్పని చెప్పే అధికారం మీకు లేదంటూ సుధాకర్‌రెడ్డికి స్పష్టం చేశారు. ‘మేం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే హక్కు మాకు ఉంది’ అని తేల్చి చెప్పారు. ‘‘ఉదయం 10.30 గంటలకే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ మొదలుపెట్టింది. అలాంటప్పుడు చట్టవిరుద్ధమైన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను మేమెలా అమలు చేయగలం? పైపెచ్చు అంత రాత్రి మేం వెళ్లి జైలుగేట్లు తెరవలేం కదా? ఇదో ప్రత్యేక కేసు అన్నట్లు కనిపించేలా ఈ కోర్టు వ్యవహరించకూడదు. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగంలోని అధికరణను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సుధాకరరెడ్డి నివేదించారు. అయినా ఈ కేసులో అంత ప్రత్యేక ఆసక్తి ఏముందన్నారు. ఈ సమయంలో జస్టిస్ లలిత తీవ్రంగా స్పందించారు. కంట్రోల్లో ఉండి మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు. -
ఏపీలో కోవిడ్ కేర్ సెంటర్లపై కొరడా
సాక్షి, విజయవాడ: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లపై అధికారులు కొరడా ఝళిపించారు. విజయవాడలోని ఐదు ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులను ఆరోగ్య విభాగం అధికారులు బుధవారం రద్దు చేశారు. నిబంధనల ఉల్లంఘన, అధిక ఫీజులు వసూలు చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్‌కు చెందిన ఐరా హోటల్, ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య , హోటల్ సన్ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. (చదవండి: తప్పంతా రమేష్ ఆస్పత్రిదే) -
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు
సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. (చదవండి: పుట్టెడు దుఃఖంలో ఉన్నా లంచం తప్పలేదు) వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు 6 చెక్కులు ఇవ్వడం జరిగింది. సాయంత్రం ముగ్గురికి మచిలీపట్నంలో చెక్కులు అందిస్తాం. మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్ వారి ఇంటికి వెళ్లి చెక్కు అందజేస్తారు. నాణ్యతా, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవు. రమేష్ హాస్పిటల్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని నోటీస్ జారీ చేశాము. ఆ ఆస్పత్రిలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురుని అరెస్ట్ చేశాం’అని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా బారిన పడుతున్న జర్నలిస్టుల సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్ల నాని తెలిపారు. (చదవండి: రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?) -
ఆసుపత్రికి డబ్బు రోగం
-
న్యాయం చేసేలా వికేంద్రీకరణ
-
‘రమేష్‌ను ఎక్కడ దాచారో చంద్రబాబు చెప్పాలి’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో ప్రజా ఉద్యమమే లేదు. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం అన్నారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. అమరావతి అనేది పెద్ద స్కాం. చంద్రబాబు తన తాబేదార్లు కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమమం ఇలా ఉంటుందా. దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వలన మనం నష్ట పోయాం. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు’ అని స్పష్టం చేశారు అంబటి. (డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా బాబూ?) అంతేకాక ‘జూమ్‌లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరిని సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారు. పీడిత ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ మద్దతు తెలుపుతున్నారు. తమది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా.. లేక క్యాప్టలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా అనే దానికి రామకృష్ణ సమాధానం చెప్పాలి. నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా. అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు.. తనని పోలీసులకు అప్పగించాలి. విచారణకు రమేష్ సహకరించాలి. తనని ఎక్కడ దాచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు అంబటి. -
హీరో రామ్‌కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న
సాక్షి, కృష్ణా జిల్లా: కులం పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపిందా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఒక్కడే మా సామాజిక వర్గానికి నాయకుడు కాదు. గతంలో చాలా మంది నాయకులు మా కోసం పని చేశారు. చంద్రబాబుతోనే మా సామాజిక వర్గానికి ముప్పు. బాబుకు ఉన్న సమస్యలు అన్నీ కులానికి రుద్దుతాడు. (డా.రమేష్ ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి) ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడు. ప్రతిసారి అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు. రామ్ సినిమాలు ఒక్క అతని సామాజిక వర్గం వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి’అని వంశీ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. (కులాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు) -
ఆచూకీ చెబితే రూ. లక్ష బహుమతి: సీపీ
సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో నిందితులు, అనుమానితులు విచారణకు సహకరించడం లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రమేష్ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్ హోటల్ యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారన్నారు. విచారణలో భాగంగా.. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా కోవిడ్ సెంటర్ నిర్వహించారని తెలిపారు. ఈ ఘటనలో ఆస్పత్రి బోర్డు సభ్యులతో పాటు అనుమానితులుగా ఉన్న ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు. (‘రమేష్ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది’) కాగా స్వర్ణప్యాలెస్ ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింన విషయం తెలిసిందే. కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్ఓ, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ కమిటీ... రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని నివేదికలో స్పష్టం చేసింది. -
స్వర్ణప్యాలెస్: విచారణ కమిటి నివేదిక
-
స్వర్ణప్యాలెస్ ఘటన: విచారణ కమిటి నివేదిక
సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్ అనుమానితులతో పాటుగా వైరస్ సోకని వారిని(నెగెటివ్ ఫలితం వచ్చినవారు) కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకముందే.. హోటల్ స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది. సదరు హోటల్లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండానే పేషెంట్లను తరలించిందని తెలిపింది. కాగా స్వర్ణప్యాలెస్ ఘటనపై కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్ఓ, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. (రమేశ్‌కు పారిపోవాల్సిన అవసరం ఏముంది?) విచారణలో కమిటీ పేర్కొన్న కీలక అంశాలు రమేష్ ఆస్పత్రి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదు. కోవిడ్ కేర్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది. అన్ని విషయాలు తెలిసి కూడా.. ఉద్దేశ పూర్వకంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే నియమాలను, చట్టాలను పట్టించుకోలేదు. కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించింది కోవిడ్ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారు. ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించింది. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఎం–5, మెట్రోపాలిటిన్ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్ కేర్ సెంటర్లను రమేశ్ ఆస్పత్రి నిర్వహించింది. స్వర్ణ ప్యాలెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే, దీనికి ముందుగానే కోవిడ్ చికిత్స పేరుతో పేషెంట్లను అక్కడ ఉంచారు. అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవు. గత పన్నెండున్నర సంవత్సరాలుగా 19.4 మీటర్ల ఎత్తులో, అత్యంత రద్దీ ప్రదేశంలో ఈ హోటల్ కొనసాగుతోంది. ప్రభుత్వ నియమాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లేదు. మున్సిపల్ కార్పొరేషన్‌కు కట్టాల్సిన పన్నులు కూడా కట్టలేదు. రూ.33.69లక్షల పన్ను బకాయిలు కట్టలేదు. -
నాపై కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కోవిడ్ రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారన్నారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన పరువు పోతుందని, ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఇదే అభ్యర్థనతో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ ఎం.సీతారామమోహనరావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా విజయవాడ లీగల్: తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని కోరుతూ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఏపీపీ కౌంటర్ దాఖలు నిమిత్తం వాయిదా వేశారు. గవర్నర్‌పేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేనందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డాక్టర్ రమేష్‌బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, హోటల్ స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాన్ని ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. -
ఇక్కడా ఉంది... ఓ స్వర్ణ ప్యాలెస్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ...పది మంది మృతి ఘటన భయానక దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అలాంటి దుర్ఘటనలు ఇతర జిల్లాల్లో జరగకూడదని అధికార యంత్రాంగం నిఘా వేస్తున్న వేళ...రాజమహేంద్రవరంలో ఎంచక్కా ఓ లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకొని కోవిడ్ రోగులకు ఓ సాధారణ వైద్యుడు లక్షల రూపాయలు గుంజుకుంటూ చికిత్స అందిస్తున్న వైనం తాజాగా బయటపడింది. కోవిడ్ రోగికి ఎంత సీరియస్‌గా ఉన్నా సరే చిటికెలో బాగు చేసేస్తామంటూ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు గుంజుతూ చివరిలో ‘సారీ’ చెప్పి శవాన్ని అప్పగిస్తున్నారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న ఓ ఆసుపత్రిలో రోగులను పెట్టకుండా మెయిన్ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో (లాడ్జి) గదులు అద్దెకు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వారి వద్దనుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ దందాకు తెరలేపుతున్నాడు ఓ సాధారణ వైద్యుడు. దగ్గు, జ్వరం లక్షణాలతో వస్తే చాలు కోవిడ్‌గా నిర్ధారించేసి వైద్యం ప్రారంభించేస్తున్నారు. ఎటువంటి భద్రతా నిబంధనలు అక్కడ కానరావు. కోవిడ్ వైద్య చికిత్సలకు తాము సూచించిన ఆసుపత్రులు మినహా ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, హోటళ్లలో నిర్వహణకు అనుమతే లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ బాగోతంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో డీఎంహెచ్‌వో దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అడిషనల్ డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీచేశారు. అయితే అక్కడ ఏమీ లేదని, దీనిపై విచారణ చేశామని ఆమె చెబుతుండడం గమనార్హం. అయితే బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేశారని, ఫోన్లో సంభాషణ ఆడియో క్లిప్‌లు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా వెంటనే విచారణ ప్రారంభించామని డీఎంహెచ్‌వో సుబ్రమణ్వేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. దందా నిజమేనని, స్వయంగా బాధితుల ఆడియో క్లిప్పింగ్‌లు తన వద్ద ఉన్నాయని ఉన్నతాధికారి చెబుతుండగా ... కిందిస్థాయి అధికారి మాత్రం ‘అబ్బే...అక్కడేమీ జరగడం లేద’ని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా అమ్మ చనిపోతుందని తెలిసినా డబ్బులు గుంజారు మా అమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాం. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి బాగోలేదు తీసుకెళ్లిపొమ్మని చెప్పారు. ఉదయం నుంచి అర్ధ్రరాత్రి వరకు ఎన్నో ఆసుపత్రులకు ఆటోలో తిప్పాం. ఎవరూ జాయిన్ చేసుకోలేదు. అయితే సెంట్రల్ జైలు వద్ద ఒక ఆసుపత్రి ఉంది ... అక్కడకు వెళ్లమంటే వెళ్లాం. అక్కడ వైద్యులు చూసి ‘చూద్దాం బతికిద్దాం...ముందుగా రూ.1.50 లక్షలు కట్టండ’ని తెలిపారు. డబ్బులు అప్పుచేసి తెచ్చి రూ.50 వేలు కట్టాను. మర్నాడు ఉదయం అమ్మ చనిపోయింది. కనీసం ఐసీయూలో కూడా పెట్టలేదు, ఆక్సిజన్ ఇవ్వలేదు. రెండు ఇంజక్షన్లు, సిలైన్ పెట్టి వదిలేసి... ఒక్కరోజుకు రూ.50 వేలు తీసుకున్నారు.–శ్రీనివాస్, రాజమహేంద్రవరం అనుమతి ఎవరికీ ఇవ్వలేదు కోవిడ్ చికిత్సకు మేము సూచించిన ఆసుపత్రులు తప్ప అదనంగా ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. హోటల్లో కోవిడ్ చికిత్స చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.– అభిషిక్త్ కిశోర్, కమిషనర్, రాజమహేంద్రవరం విచారణ ప్రారంభించాం కోవిడ్ చికిత్సకు ఆ ఆసుపత్రికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే మెయిన్ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో కోవిడ్ రోగులను ఉంచి చికిత్స చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మా వద్ద ఓ ఆడియో క్లిప్ కూడా ఉంది. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాం. దీనికి సంబంధించి రిపోర్టు రావాల్సివుంది. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. చర్యలు తప్పవు.– సుబ్రహ్మణ్వేశరి,డీఎంహెచ్‌వో, కాకినాడ -
ఈమెయిల్ సాక్షిగా అంతులేని ధనాపేక్ష..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏ సదుపాయమూ ఆ హోటల్లో లేదు. ఆ విషయం తెలిసి కూడా కేవలం ధనాపేక్షతో ప్రజల ప్రాణాల పట్ల అంతులేని నిర్లక్ష్యంతో రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం వ్యవహరించిందని స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఇందుకు రమేష్ హాస్పటల్స్‌కు... కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసిన స్వర్ణా ప్యాలెస్ హోటల్‌కు మధ్య నడచిన ఈమెయిల్సే సాక్ష్యమని చెబుతున్నారు. ఆ హోటల్లో సౌకర్యాలు లేవని తెలిసినా పట్టించుకోకుండా డబ్బు కోసమే రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం హడావిడిగా కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. అన్నీ తెలిసినా.. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ లేవు. ఫైర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా తీసుకోలేదు. అగ్నిమాపక పరికరాలు లేవు. ఈ విషయాలు రమేష్ హాస్పటల్స్, స్వర్ణప్యాలెస్ మధ్య ఈనెల ఆరంభంలో జరిగిన ఈమెయిల్ ఉత్తరప్రత్యురాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ దర్యాప్తు అధికారులు సేకరించారని సమాచారం. ఫైర్ ఎన్ఓసీ లేకపోయినా అగ్నిమాపక సదుపాయాలు లేకపోయినా రమేష్ యాజమాన్యం పట్టించుకోలేదు... స్వర్ణ ప్యాలెస్‌లో తగిన సదుపాయాలు లేవని తెలిసినా రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం అక్కడ కోవిడ్ సెంటర్‌ను హడావిడిగా ఏర్పాటు చేసేసిందని తెలుస్తోంది. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందున అక్కడ విద్యుత్తు పరికరాలు ఎలా ఉన్నాయి? వాటి సామర్ధ్యం.. నాణ్యత ఎలా ఉంది తదితరాలను పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా ఆసుపత్రి యాజమాన్యానిదే. కానీ వారు ఆ విషయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. 30 మందిలో 26 మందికి నెగటివ్... ఇంత దారుణమా? స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం రమేష్ హాస్పటల్స్ వారు ఉంచిన 30 మందిలో 26 మందికి కరోనా నెగటివ్ వ్యక్తులే. అంటే డబ్బులు గుంజుకోవడానికి రోగం లేకపోయినా అక్కడ ఉంచారని పరిశీలన బృందాలు గుర్తించాయి. రమేష్ హాస్పటల్స్‌కు తెలిసే ఇది జరిగిందనే ప్రాథమిక అంచనాకు వచ్చాయి. మెట్రోపాలిటన్ హోటల్‌కు అనుమతులు లేకున్నా... స్వర్ణ ప్యాలెస్‌తో పాటు నగరంలోని మరో నాలుగు హోటళ్లలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అందులో మెట్రోపాలిటిన్ హోటల్లో కూడా ఒకటి. జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వకముందే ముందే అక్కడ సెంటర్‌ను ప్రారంభించి పదిహేను మంది కోవిడ్ అనుమానితులను ఉంచింది. అక్కడ అనుమతులు ఉన్నాయా? లేవా? అని పోలీస్ యంత్రాంగం ప్రశ్నించిన తరువాత అక్కడి నుంచి వెనువెంటనే మరో ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఈ విషయాన్ని పోలీస్, నిఘా వర్గాలతో పాటు పరిశీలక బృందాలు గుర్తించాయి. కాగా అగ్నిప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు పోయిన నేపథ్యంలో నకిలీధృవీకరణ పత్రాల సృష్టికి హాస్పటల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. కోవిడ్‌కు గ్రేడింగ్‌లు, శాతాలు.. కోవిడ్ అనుమానంతో వచ్చిన వారికి సీటీ స్కాన్ చేసి మీకు జబ్బు లక్షణాలు ఉన్నాయని, ముదిరిపోయి మూడో దశ, నాలుగో దశకు చేరిందని, 50, 60, 70... శాతం ఉందంటూ భయం కొలిపే రీతిలో చెప్పి ఫలానా కోవిడ్ కేర్ సెంటర్లలో చేరండని సూచించే వారని నిఘా వర్గాలు గుర్తించాయి. పేషెంట్లను చేర్చుకునేందుకు మార్కెటింగ్ మేనేజర్లను, పీఆర్వోలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది. ఒక్క ఎంఒయూ ఉంటే ఒట్టు కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేసి డబ్బులు గుంజడంలో చూపిన శ్రద్ధ రమేష్ హాస్పటల్స్ మరే విషయంలోనూ చూపలేదని స్పష్టమవుతోంది. ఫార్మసీ ఏర్పాటుకు, ఆక్సిజన్ సప్లయిర్స్, శానిటైజేషన్, ట్రీట్మెంట్, హెల్త్ వర్కర్స్, హాస్పటల్ వేస్టేజ్‌కు సంబం«ధించిన ఎలాంటి ఒప్పందాలు లేవని పరిశీలనా బృందాలు గుర్తించాయి. సెంటర్ల ఏర్పాటుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ దాఖలుచేసిన పత్రాల్లో ‘కోవిడ్ కేర్ సెంటర్ ఫర్ పాజిటివ్ కేసెస్ ’ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అలాంటప్పుడు హాస్పటల్ కోసం ఏమైతే అవసరమో అలాంటివి కోవిడ్ సెంటర్లో ఉండాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస తదితర సమస్యలు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు సాధారణంగా ఉంటాయి కాబట్టి వైద్యపరంగా కనీస ఏర్పాట్లు అవసరమని, స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో అలాంటివి లేవని అధికారులు గుర్తించారు. -
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురి అరెస్ట్
సాక్షి, కృష్ణా: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాలరావుతో పాటు.. జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోటల్ నిర్వాహకులతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ పేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. (విజయవాడ ప్రమాదంపై చంద్రబాబు స్పందించరే?) కమిటీ పరిశీలన అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్‌ను జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ సోమవారం పరిశీలించింది. ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్లను కమిటీ సభ్యులు ధ్యానచంద్, గీతాబాయి, ఉదయభాస్కర్, రమేష్ బాబు పరిశీలించారు. మూడు అంశాల ప్రాదిపదికన విచారణ చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. స్వర్ణప్యాలెస్ హోటల్లో సంరక్షణ చర్యలు, కోవిడ్ నిబంధనలు.. ప్రమాద కారణంపై విచారణ చేస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేదా రసాయనాల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని కమిటీ అధికారిణి గీతాబాయి తెలిపారు. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. కాగా, రమేష్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా అనుమతులు లేకుండా.. స్వర్ణ హైట్స్ (స్వర్ణ ప్యాలెస్)లో కోవిడ్ ఆస్పత్రి నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు గుర్తించారు. 20 బెడ్ల కెపాసిటీతో అనధికారికంగా స్వర్ణ హైట్స్‌ను.. కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి ఆస్పత్రి యాజమాన్యం లీజ్‌కు తీసుకున్నట్టు వెల్లడైంది. ప్రభుత్వం నియమించిన రెండు కమిటీల నివేదికల అనంతరం ప్రమాద కారణాలపై స్పష్టత రానుంది. ఇక జేసీ శివశంకర్ కమిటీతోపాటు కృష్ణా జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. (విషాద 'జ్వాల') -
కరోనా మిగిల్చిన విషాదం..!
సాక్షి, ప్రకాశం: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబంలోని నలుగురు ఒకరి తరువాత ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కరోనా నుంచి కోలుకుని నేడో రేపో ఇంటికి చేరుకుంటామని ఆశించినంతలోనే ఊహించని రీతిలో ఇద్దరిని అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఇదీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జయలక్ష్మి, పవన్‌కుమార్ కుటుంబంలోని విషాదగాథ. (ప్రమాదానికి కారణమిదేనా?) కందుకూరు పట్టణంలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉండే దుడ్డు ప్రసాద్ ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి మాల ధరించే భక్తులకు గురుస్వామిగా ప్రసిద్ధి. కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఆంజనేయస్వామి మాల ధరించే భక్తులందరూ ప్రసాద్ గురుస్వామి వద్దనే మాల తీసుకుంటారు. ఆ విధంగా ప్రసాద్ చాలా సుపరిచితుడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్ నుంచి వైరస్ ఆయన భార్య వెంకట జయలక్ష్మి (48), ఆయన పెద్దకుమారుడు పవన్‌కుమార్ (30), రెండో కుమారుడు మనోజ్‌కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. (మృత్యు కీలలు) అధికంగా లక్షణాలు ఉన్న వెంకట జయలక్ష్మి, పవన్‌కుమార్‌లు కూడా రమేష్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. ఐదు రోజులుగా వారిని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రెండో కుమారుడు మనోజ్‌కు మాత్రం లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు. రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జయలక్ష్మి, పవన్ కుమార్‌లు కూడా ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా నుంచి కోలుకున్నా అగ్ని ప్రమాదం వాళ్ల పాలిట యమపాశంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కుమార్ భార్య ఏడు నెలల గర్భిణి: అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పవన్‌కుమార్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇంటికి వచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్‌కుమార్‌కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక 7వ నెల గర్భిణి. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పవన్‌కుమార్ మృతితో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా ఈ రెండు కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఇక రెండో కుమారుడు మనోజ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కరోనా వైరస్ సోకడంతో ప్రస్తుతం కందుకూరు పట్టణంలోనే ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంలో తల్లి, అన్న ఇద్దరూ మృతి చెందినా బయటకు రాలేని పరిస్థితిలో మనోజ్ తల్లడిల్లుతున్నాడు. -
నేను పడ్డ బాధ భగవంతుడికే తెలియాలి..
సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాద సంఘటనలో మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాలతో బయటపడిన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ బాధితుడు ఇంకా తేరుకోలేదు. ప్రమాదం నుంచి బయటపడేందుకు తాము పడ్డ బాధ భగవంతుడికే తెలుసునని సీహెచ్ పవన్‌సాయి కిషన్ తెలిపారు. తాను ప్రాణాలతో ఉన్నానంటే ఫైర్, పోలీసు సిబ్బంది చలువేనని అతడు పేర్కొన్నారు. ‘స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నేనొక బాధితుడిని. నా రూమ్ నెంబర్ 304. ఆ సమయంలో నేనే చాలా ఇబ్బంది పడ్డాను. ఎటువెళ్లాలో అర్థం కాలేదు. దట్టమైన పొగ నల్లగా కమ్ముకుంది. అంతట మంటలు వ్యాపించాయి. (విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం) ఎటువెళ్లాలో తెలియని ప్రాణాపాయ స్థితిలో కిటికీలు పగుల గొట్టుకుని కారిడార్లోకి వచ్చి కాపాడండి అంటూ అరిచాను. తేరుకుని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాను. వారు తక్షణమే స్పందించి కాపాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం. మా బాధ ఎంతో వర్ణనాతీతం. ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం పడ్డ బాధ భగవంతుడికి తెలియాలి. కనీస సౌకర్యాలు లేని స్వర్ణా ప్యాలెస్‌ను ఏ విధంగా కోవిడ్ సెంటర్‌కు ఇచ్చారు. రమేష్ హాస్పిటల్ వారు తగు వైద్య సౌకర్యం కల్పించాలి.’ అని డిమాండ్ చేశారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి) -
రమేశ్ హాస్పిటల్స్ విస్తరణ బాట
సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న రమేశ్ హాస్పిటల్స్ ఇతర జిల్లాల విస్తరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను దక్కించుకుంది. ఇది 150 పడకల ఆసుపత్రి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరుల్లో కలిపి మూడు హాస్పిటల్స్‌లో 560 పడకలున్నాయని, ఈ కొనుగోలు ద్వారా పడకల సంఖ్య 710కి చేరిందని రమేశ్ హాస్పిటల్స్ డైరెక్టర్ పి.రవి కిరణ్ తెలిపారు. ప్రస్తుతం సంఘమిత్ర సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం, పేరు య«థావిధిగానే కొనసాగుతాయన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.150 కోట్ల పెట్టుబడితో రమేశ్ హాస్పిటల్స్ పడకల సంఖ్యను 1,200 నుంచి 1,500 పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని తెలియజేశారు. రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పి.రమేశ్ బాబు మాట్లాడుతూ 1988లో 6 పడకలతో ప్రారంభించిన ఈ హాస్పిటల్లో ఇప్పుడు 120 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.లిస్టెడ్ కంపెనీ ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ గ్రూపుతో రమేశ్ హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. -
కలలు నెరవేర్చుకోవడానికి శ్రమించండి
విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు గుంటూరు: జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కలలు కని వాటిని నెరవేర్చుకునేం దుకు కఠోరంగా శ్రమించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థులకు పిలుపునిచ్చారు. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆది వారం గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని చేతన ప్రాంగణంలో పూర్వ విద్యార్థి వడ్లమాని రవికిరణ్ చేతివేళ్ల ఆకారంలో రూపొందించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. అందరికి ఒక్క హృదయం మాత్రమే ఉంటుందని, వైద్యులకు మాత్రం బయాటికల్ హార్ట్తోపాటు, కైండ్ హార్ట్ ఉండాలని గుంటూరులో రమేష్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో కలాం అన్నారు. తాడిగడపలోని ఎల్వీ కంటి ఆస్పత్రిలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కలాం అంధత్వ నివారణకు అందరూ కృషి చేయాలని, నేత్రదానానికి దాతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా పనిచేయాలి: వెంకయ్యనాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాగా పని చేసినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రమేష్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ సభలో అన్నారు. తుళ్లూరును రాజధానిగా ప్రకటించినప్పటికీ గుంటూరు - విజయవాడ మధ్యే రాజధాని నిర్మాణం మొత్తం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకీ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు తమ శాఖ నుంచి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రమేష్ తదితరులు మాట్లాడారు.