సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏ సదుపాయమూ ఆ హోటల్‌లో లేదు. ఆ విషయం తెలిసి కూడా కేవలం ధనాపేక్షతో ప్రజల ప్రాణాల పట్ల అంతులేని నిర్లక్ష్యంతో రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం వ్యవహరించిందని స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. ఇందుకు రమేష్ హాస్పటల్స్‌కు... కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసిన స్వర్ణా ప్యాలెస్ హోటల్‌కు మధ్య నడచిన ఈమెయిల్సే సాక్ష్యమని చెబుతున్నారు. ఆ హోటల్‌లో సౌకర్యాలు లేవని తెలిసినా పట్టించుకోకుండా డబ్బు కోసమే రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం హడావిడిగా కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.
అన్నీ తెలిసినా..
కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ లేవు. ఫైర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) కూడా తీసుకోలేదు. అగ్నిమాపక పరికరాలు లేవు. ఈ విషయాలు రమేష్ హాస్పటల్స్, స్వర్ణప్యాలెస్ మధ్య ఈనెల ఆరంభంలో జరిగిన ఈమెయిల్ ఉత్తరప్రత్యురాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ దర్యాప్తు అధికారులు సేకరించారని సమాచారం. ఫైర్ ఎన్‌ఓసీ లేకపోయినా అగ్నిమాపక సదుపాయాలు లేకపోయినా రమేష్ యాజమాన్యం పట్టించుకోలేదు... స్వర్ణ ప్యాలెస్‌లో తగిన సదుపాయాలు లేవని తెలిసినా రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం అక్కడ కోవిడ్ సెంటర్‌ను హడావిడిగా ఏర్పాటు చేసేసిందని తెలుస్తోంది. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందున అక్కడ విద్యుత్తు పరికరాలు ఎలా ఉన్నాయి? వాటి సామర్ధ్యం.. నాణ్యత ఎలా ఉంది తదితరాలను పరిశీలించుకోవాల్సిన బాధ్యత కూడా ఆసుపత్రి యాజమాన్యానిదే. కానీ వారు ఆ విషయాలను పట్టించుకున్న దాఖలాలు లేవు.
30 మందిలో 26 మందికి నెగటివ్... ఇంత దారుణమా?
స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ ట్రీట్‌మెంట్ కోసం రమేష్ హాస్పటల్స్ వారు ఉంచిన 30 మందిలో 26 మందికి కరోనా నెగటివ్ వ్యక్తులే. అంటే డబ్బులు గుంజుకోవడానికి రోగం లేకపోయినా అక్కడ ఉంచారని పరిశీలన బృందాలు గుర్తించాయి. రమేష్ హాస్పటల్స్‌కు తెలిసే ఇది జరిగిందనే ప్రాథమిక అంచనాకు వచ్చాయి.
మెట్రోపాలిటన్ హోటల్‌కు అనుమతులు లేకున్నా...
స్వర్ణ ప్యాలెస్‌తో పాటు నగరంలోని మరో నాలుగు హోటళ్లలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు రమేష్ హాస్పటల్స్ యాజమాన్యం ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అందులో మెట్రోపాలిటిన్ హోటల్‌లో కూడా ఒకటి. జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వకముందే ముందే అక్కడ సెంటర్‌ను ప్రారంభించి పదిహేను మంది కోవిడ్ అనుమానితులను ఉంచింది. అక్కడ అనుమతులు ఉన్నాయా? లేవా? అని పోలీస్ యంత్రాంగం ప్రశ్నించిన తరువాత అక్కడి నుంచి వెనువెంటనే మరో ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఈ విషయాన్ని పోలీస్, నిఘా వర్గాలతో పాటు పరిశీలక బృందాలు గుర్తించాయి. కాగా అగ్నిప్రమాదం సంభవించి పది మంది ప్రాణాలు పోయిన నేపథ్యంలో నకిలీధృవీకరణ పత్రాల సృష్టికి హాస్పటల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి.
కోవిడ్‌కు గ్రేడింగ్‌లు, శాతాలు..
కోవిడ్ అనుమానంతో వచ్చిన వారికి సీటీ స్కాన్ చేసి మీకు జబ్బు లక్షణాలు ఉన్నాయని, ముదిరిపోయి మూడో దశ, నాలుగో దశకు చేరిందని, 50, 60, 70... శాతం ఉందంటూ భయం కొలిపే రీతిలో చెప్పి ఫలానా కోవిడ్ కేర్ సెంటర్లలో చేరండని సూచించే వారని నిఘా వర్గాలు గుర్తించాయి. పేషెంట్లను చేర్చుకునేందుకు మార్కెటింగ్ మేనేజర్లను, పీఆర్‌వోలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది.
ఒక్క ఎంఒయూ ఉంటే ఒట్టు
కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుచేసి డబ్బులు గుంజడంలో చూపిన శ్రద్ధ రమేష్ హాస్పటల్స్ మరే విషయంలోనూ చూపలేదని స్పష్టమవుతోంది. ఫార్మసీ ఏర్పాటుకు, ఆక్సిజన్ సప్లయిర్స్, శానిటైజేషన్, ట్రీట్‌మెంట్, హెల్త్ వర్కర్స్, హాస్పటల్ వేస్టేజ్‌కు సంబం«ధించిన ఎలాంటి ఒప్పందాలు లేవని పరిశీలనా బృందాలు గుర్తించాయి. సెంటర్ల ఏర్పాటుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ దాఖలుచేసిన పత్రాల్లో ‘కోవిడ్ కేర్ సెంటర్ ఫర్ పాజిటివ్ కేసెస్ ’ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అలాంటప్పుడు హాస్పటల్ కోసం ఏమైతే అవసరమో అలాంటివి కోవిడ్ సెంటర్‌లో ఉండాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస తదితర సమస్యలు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లకు సాధారణంగా ఉంటాయి కాబట్టి వైద్యపరంగా కనీస ఏర్పాట్లు అవసరమని, స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్‌లో అలాంటివి లేవని అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment