కలలు నెరవేర్చుకోవడానికి శ్రమించండి
- విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు
గుంటూరు: జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కలలు కని వాటిని నెరవేర్చుకునేం దుకు కఠోరంగా శ్రమించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విద్యార్థులకు పిలుపునిచ్చారు. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆది వారం గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని చేతన ప్రాంగణంలో పూర్వ విద్యార్థి వడ్లమాని రవికిరణ్ చేతివేళ్ల ఆకారంలో రూపొందించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు.
అందరికి ఒక్క హృదయం మాత్రమే ఉంటుందని, వైద్యులకు మాత్రం బయాటికల్ హార్ట్‌తోపాటు, కైండ్ హార్ట్ ఉండాలని గుంటూరులో రమేష్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో కలాం అన్నారు. తాడిగడపలోని ఎల్‌వీ కంటి ఆస్పత్రిలో ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కలాం అంధత్వ నివారణకు అందరూ కృషి చేయాలని, నేత్రదానానికి దాతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా పనిచేయాలి: వెంకయ్యనాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమ్ ఇండియాగా పని చేసినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రమేష్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ సభలో అన్నారు. తుళ్లూరును రాజధానిగా ప్రకటించినప్పటికీ గుంటూరు - విజయవాడ మధ్యే రాజధాని నిర్మాణం మొత్తం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యాపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీకీ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసేందుకు తమ శాఖ నుంచి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రమేష్ తదితరులు మాట్లాడారు.