కలాం విడిచి వెళ్లిన పాద ముద్రలు కూడా...
(వెబ్ సైట్ ప్రత్యేకం)
రామేశ్వరం...గల్ఫ్ ఆఫ్ మున్నార్లో 53 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న చిన్నదీవి. సముద్ర మట్టానికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉంది. షిల్లాంగ్... ఈశాన్య భారతంలో ఉన్న మేఘాలయ రాజధాని.. సముద్ర మట్టానికి 5003 అడుగుల ఎత్తులో ఉంది. రెండింటి మధ్య దూరం 3,317 కిలోమీటర్లు..
ఎక్కడో రామేశ్వరంలో సాదాసీదా కుటుంబంలో పుట్టి మనసున్న మనిషిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఎందరికి సాధ్యం. సముద్రపు అలలతో ఆడుకున్న లేలేత వేళ్లు భారతదేశం గుండెలపై చేయి వేసుకుని నిశ్చంతగా నిద్రపోయేందుకు భరోసానిచ్చే క్షిపణులను తీర్చిదిద్దాయి. రామేశ్వరం ఇసుకు తీరాల్లో కదలాడిన పాదాలు భారతదేశ అణ్వస్త్ర పటంపై చెరగని ముద్రల్నీ వేశాయి. అమాయకపు చిరునవ్వు చెరగని ఆ మోము ఒక తరం యువతలో ఆలోచనల్ని రేకెత్తించే ప్రశ్నల్ని సంధించింది. రామేశ్వరమైనా రాష్ట్రపతి భవన్ అయినా అదే సామాన్య మానవుడిగా బ్రతకడం ఎందరికి సాధ్యం. ప్రజలను ముఖ్యంగా భావి భారత పౌరులను ఎక్కువగా చేరుకోవాలని, వారి చురుకైన మెదళ్లని ప్రశ్నలతో పదునెక్కించాలనే తాపత్రయం... మొదటి నుండి చివరివరకు నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రతకడం ఈ రోజుల్లో ఎంతమంది ఆచరించగలరు.
మా వల్లే కలాం రాష్ట్రపతి అయ్యారని స్వంత డబ్బా పదే పదే వాయించుకునే వాళ్లని చూస్తే నిజంగానే జాలి కలగక మానదు. రాష్ట్రపతి భవన్లో రాజరికపు ఆనవాళ్లను పట్టుబట్టి తుడిచేసిన విశాల హృదయం ముందు ఈ సంకుచిత మనస్తత్వాలు పిపీలికాలు కదూ! తన దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తనతో నడచిన వంటమనిషి దగ్గర నుండి అత్యున్నత స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తల వరకూ అందరినీ సమానంగా చూసి... ఆప్యాయంగా పలకరించిన మంచి మనసు ముందు గోముఖ వ్యాఘ్రాలు ఏ పాటివి. చెప్పిన విషయాల్నే పదేపదే చెప్పి విసుగూ విరామం లేకుండా విద్యార్థులు, యువకుల మధ్య గడిపిన మేరు నగధీరుడు.
అగ్ని, పృథ్విలాంటి క్షిపణినైనా, గగనపు అంచులను తాకిన ఎస్ఎల్వీ లాంటి రాకెట్లయినా, పోఖ్రాన్ అణు పరీక్షలైనా, తక్కువ ఖరీదు చేసే స్టెంట్లైనా, తేలికైన కాలిపర్స్ అయినా, మేధస్సును పదునెక్కించే ప్రశ్నలైనా, కలలు కనడం నేర్పే ఓపికైనా, వాటిని ఎలా నిజం చేసుకోవాలో చెప్పే మార్గదర్శనమైనా .... తను చేసిన ప్రతీపనిలో అదే నిబద్ధత. అమాయకత్వంతో కూడుకున్న పట్టుదల...అలుపెరగని ప్రయాణం.
2004 సం.రం చివరిరోజుల్లో నెల్లూరులోని ఒక పాఠశాలకు భారత రాష్ట్రపతి పర్యటన. అపుడు పనిచేస్తున్న ఒక ఆంగ్ల దినపత్రిక తరుపున కవరేజి కోసం వెళ్లా. రాష్ట్రపతి కదా.. అధికారులు,పోలీసులు, రాజకీయ నాయకుల హడావుడి ఎక్కువే.. . కొంచెం విసుగ్గా కూడా అనిపించింది.
కలాం వేగంగా వచ్చారు.. గుడీవినింగ్ చిల్డ్రన్ పలకరింపు.. అదే నవ్వు.. అప్పటివరకు ఉన్న విసుగు, చికాకు క్షణాల్లో మాయం. తర్వాత 90 నిమిషాలు చందమామ పుస్తకాల్లోని కథలు చదివినంత ఆహ్లాదం.. విజ్ఞానం.. వినోదం. ఆ తర్వాత పిల్లల మొహాల్లో ఆనందం..అబ్బురం.. ఆ చిన్ని మెదళ్లలో బెలోడన్ని ప్రశ్నలు.. సామాన్యంగా కనిపించే వ్యక్తి పిల్లల్ని ఏ మేరకు ప్రభావితం చేయగలడనే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక జర్నలిస్టుగా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అవి వార్తల్లో కనపడకూడదనే రూల్ని బ్రేక్ చేసి రిపోర్టు చేసింది ఆ రోజునే.. పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా కదిలించాడని నా వార్తకు నేనే పాఠకుణ్ని అయిన మరుసటి ఉదయం అనిపించింది.
విద్యార్థుల మధ్య గడపడం వ్యసనంగా చేసుకున్న కలాం (బహుశా ఆయనకుండిన ఒకే ఒక వ్యసనం ఇదేనేమో) ఆ విద్యార్థుల మధ్యే కుప్పకూలడం కాకతాళీయమేమో. సముద్ర మట్టానికి కేవలం ముప్ఫైఅడుగుల ఎత్తులో పుట్టి, ఎన్నోవేల అడుగుల ఎత్తులో మరణించడం.. పుట్టిన ఊరికి వేల కిలో మీటర్ల దూరంలో మరణించడం.. ఈ రెండూ ఆయన జీవితంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడానికి....ఎవరూ ప్రయాణించనంత దూరం ప్రయాణించడానికి సూచికలేమో.
ఎక్కడ పెరిగినా.. ఎంత ఎత్తు ఎదిగినా. ..పుట్టిన ఊరిలో... ఆ మట్టిలోనే కలిసిపోవాలనే చిన్నకోరిక.. దశాబ్దాల ఉద్యోగ జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల అంత్యక్రియలకు మాత్రమే సెలవు తీసుకున్నారని అప్పటి ఆయన సహోద్యోగులు పదే పదే గుర్తు చేసుకుంటారు.. ఇపుడు కలాం శాశ్వత సెలవు తీసుకున్నారు. ..దేశంలోని ప్రతిమూల తన అడుగు జాడల్ని ..ఆలోచనా స్రవంతిని ఆనవాళ్లుగా వదిలిపెట్టి.. ఇక మీద రామేశ్వరానికి వెళితే చూడటానికి సముద్రం మీద నిర్మించిన పంబన్ బ్రిడ్జి, చారిత్రాత్మక మైన రామేశ్వరం గుడి మాత్రమే కాదు.. కలాం నడిచిన, విడిచి వెళ్లిన పాద ముద్రలు కూడా...
ఎన్. గోపీనాథ్ రెడ్డి