అభివృద్ధే అసలైన నివాళి
♦ దేశ ప్రగతికి ఉడుతలా పాటుపడదాం
♦ అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభోత్సవంలో ప్రధాని పిలుపు
శ్రీరాముని కాలంలో రామేశ్వరంలోనిర్మించిన వారధికి ఉడుత చేసిన సాయంలా అందరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 125 కోట్ల జనాభా ప్రగతిపథం వైపు ఒక అడుగువేస్తే 125 కోట్ల అడుగులు ముందుకు సాగినట్లు అవుతుంది. అబ్దుల్ కలాంకు, అమ్మకు అదే మన శ్రద్ధాంజలి’’ అన్నారు. రామేశ్వరం సమీపం పెయికరుబూరులో గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం స్మారక మండపాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం విజ్ఞాన కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని పరిశీలించారు. కలాం విగ్రహాలు, చిత్రాలను తిలకించి పులకించారు. ఆ తర్వాత కాసేపు కలాం కుటుంబ సభ్యులతో గడిపారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశం అభివృద్ధి చెందినపుడే భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాంకు అసలైన నివాళి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రామనాథ పురం జిల్లా రామేశ్వరం సమీపం పెయికరుబూరులో నిర్మించిన అబ్దుల్‌కలాం స్మారక మండపాన్ని ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కలాం ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. యువతరంలో మార్పు రావాలని అబ్దుల్ కలాం ఆశించేవారని, తమ ప్రభుత్వం ఆయన ఆశయాల సాధనకు అంకితం అవుతూ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఉద్యోగాల కోసం యువత పరుగులు పెట్టకుండా ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా పథకాలను రూపొందించామని అన్నారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని చెప్పారు.
సముద్రంలో చేపల వేట సమయంలో మత్స్యకారుల కష్టాలకు పరిష్కారంగా కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని మోదీ తెలిపారు. ముఖ్యంగా నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అందుకే గ్రీన్ కారిడార్ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. రామాభిరాముని చరిత్రలో రామేశ్వరం ప్రస్తావన కూడా ఉండడం వల్ల ఆయోధ్య–రామేశ్వరం మధ్య రైలు సేవలను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అలాగే ధనుష్కోటికి రహదారిని నేడు ప్రారంభించిన్నట్లు ఆయన చెప్పారు. చెన్నై, మదురై, కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి రూ.900 కోట్లను మంజూరు చేశామని ప్రధాని తెలిపారు.
అలాగే అమృత్ పథకాన్ని రామేశ్వరం, తిరునెల్వేలి, నాగర్‌కోవిల్, మదురై నగరాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. తమిళనాడులోని 8లక్షల మందికి ఇళ్లు కావాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉండి ఉంటే మణిమండపాన్ని చూసి ఎంతో మెచ్చుకునేవారని ఆయన అన్నారు. ఈ శుభతరుణంలో ఆమె లేకపోవడం బాధాకరమని అన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రజలందరి హృదయాల్లో కలాం చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కచ్చదీవులను భారత్ స్వాధీనం చేసుకోవడం ద్వారా తమిళ మత్స్యకారుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రధాని మోదీకి సీఎం ఎడపాడి తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు.
కలాం..సలాం
అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలిసి మోదీ కూడా పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసింది.
ఆటో సవారీ ఉచితం
అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని చెన్నైకి చెందిన వీరాభిమాని కలైయరసన్ గురువారం ఉచిత సవారీ నిర్వహించాడు. ఉదయం 7గంటల నుంచి రాత్రి వరకు తన ఆటో ఎక్కిన ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేయకుండా కోరినచోట దింపాడు. ‘నేను వదిలేసి వెళ్లిన పనులను పూర్తిచేయండి విద్యార్థులారా’ అనే అబ్దుల్ కలాం నినాదాన్ని ఆటో వెనుక పోస్టర్‌గా అంటించుకుని ప్రచారం చేశాడు. తన సేవలను గురించి కలైయరసన్ మాట్లాడుతూ, ఆటో సవారీతో రోజుకు రూ.700 సంపాదిస్తా, ఇందులో రూ.250 యజమానికి, రూ.200లు పెట్రోలుకు పోగా రూ.250 తనకు మిగులుతుందని తెలిపాడు. కలాం ఒక మంచి మనిషి, ఈ దేశానికి ఎంతో చేశాడు, ఆయన వర్ధంతి, జయంతి రోజుల్లో గత మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్నానని, ఇక కూడా కొనసాగిస్తానని తెలిపాడు.
కలాం కుటుంబంతో కాసేపు..
ఈ సందర్భంగా అబ్దుల్ కలాం కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తది తర సభ్యులతో కలిసి కూర్చుని క్షేమ సమాచా రాలు తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చునబెట్టుకుని మురిపెంగా ముద్దులాడా రు. మోదీకి కుటుంబసభ్యులంతా ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం మదురై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు స్వాగతం పలికారు. ప్రధానితోపాటూ కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు వచ్చారు. మదురై నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో స్మారక మందిరానికి చేరుకున్నారు. అదే హెలికాప్టర్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం ఎడపాడి సైతం వచ్చారు.
11.30 గంటలకు స్మారక మండపాన్ని, కలాం ఆలోచనలకు అద్దం పట్టేలా రూపొందించిన కలాం విజన్ 2020 సంతోష్ వాహిని ప్రచార రథాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం కలామ్ ద్వితీయ వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌బెల్ట్ కారిడార్ పథకం కింద నడిసముద్రంలో చేపలవేట నిమిత్తం ప్రాజెక్టు అనుమతి ప్రతిని మత్య్సకారులకు అందజేశారు. దేశంలోని రెండు ఆధ్యాత్మిక కేంద్రాలైన రామేశ్వరం–అయోధ్య మధ్య రైలు సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేదికపై నుంచే ప్రారంభించారు.
రూ.55 కోట్లతో నిర్మించిన రామేశ్వరం–ధనుష్కోటి జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం పళనిస్వామి, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పొన్ రాధాకృష్ణన్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై పాల్గొన్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.40 గంటలకు మదురై నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.