సాక్షి, అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కోవిడ్ రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారన్నారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తే తన పరువు పోతుందని, ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇదే అభ్యర్థనతో రమేశ్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ ఎం.సీతారామమోహనరావు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
విజయవాడ లీగల్: తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని కోరుతూ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఏపీపీ కౌంటర్ దాఖలు నిమిత్తం వాయిదా వేశారు. గవర్నర్‌పేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేనందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డాక్టర్ రమేష్‌బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, హోటల్ స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాన్ని ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment