సాక్షి, అమరావతి: విజయవాడ స్వర్ణాప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసులో రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు చివరికి దిగొచ్చారు. ఈ కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో రమేష్‌బాబును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు దర్యాప్తు అధికారికి ఎట్టకేలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు దర్యాప్తు అధికారి అయిన అదనపు డిప్యూటీ కమిషనర్ ముందుహాజరు కావాలని రమేష్‌బాబును ఆదేశించింది. ఆ మూడురోజుల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రమేష్‌బాబును విచారించాలని సూచించింది. విచారణ సమయంలో డాక్టర్ రమేష్‌బాబుతో న్యాయవాదిని అనుమతించాలని, థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ రెండురోజుల కిందట ఉత్తర్వులు జారీచేశారు. స్వర్ణాప్యాలెస్‌లో రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేంద్రంలో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్‌పేట పోలీసులు రమేష్ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ రమేష్‌బాబు.. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఆగస్టు 25న విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్.. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దర్యాప్తును ఆపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టింది. దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేస్తూ.. దర్యాప్తునకు సహకరించాలని డాక్టర్ రమేష్‌బాబును ఆదేశించింది.
హైకోర్టులో పోలీసుల పిటిషన్
ఇదిలావుండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఇటీవల హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాము పలు డాక్యుమెంట్లు సమర్పించాలంటూ నోటీసులు జారీచేసినా డాక్టర్ రమేష్‌బాబు స్పందించడం లేదని, అందువల్ల ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో రమేష్‌బాబు పోలీసులకు సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని హైకోర్టుకు తెలిపారు. దీంతో రమేష్‌బాబును మూడురోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
పోలీసు కస్టడీకి డాక్టర్ రమేష్‌బాబు
Published Sat, Nov 28 2020 5:19 AM | Last Updated on Sat, Nov 28 2020 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment