సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న రమేశ్ హాస్పిటల్స్ ఇతర జిల్లాల విస్తరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను దక్కించుకుంది. ఇది 150 పడకల ఆసుపత్రి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరుల్లో కలిపి మూడు హాస్పిటల్స్‌లో 560 పడకలున్నాయని, ఈ కొనుగోలు ద్వారా పడకల సంఖ్య 710కి చేరిందని రమేశ్ హాస్పిటల్స్ డైరెక్టర్ పి.రవి కిరణ్ తెలిపారు.
ప్రస్తుతం సంఘమిత్ర సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం, పేరు య«థావిధిగానే కొనసాగుతాయన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.150 కోట్ల పెట్టుబడితో రమేశ్ హాస్పిటల్స్ పడకల సంఖ్యను 1,200 నుంచి 1,500 పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని తెలియజేశారు.
రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పి.రమేశ్ బాబు మాట్లాడుతూ 1988లో 6 పడకలతో ప్రారంభించిన ఈ హాస్పిటల్‌లో ఇప్పుడు 120 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.లిస్టెడ్ కంపెనీ ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ గ్రూపుతో రమేశ్ హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment