సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. వారం వారం విడతల వారీగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముందుగా ఒకట్రెండు రోజుల్లో ఎంబీబీఎస్ అర్హతతో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
ఈ మేరకు సోమవారం ఆయన మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని హరీశ్ ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రెండుమూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెక్రెటరీ గోపీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
నర్సులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష..
‘ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజి మార్కులు ఇవ్వాలి. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్ పీఎస్సీ.. నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు.. మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలి.
స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి.. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. 80 మార్కులు రాత పరీక్షకు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి ఇవ్వాలి. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆ ఖాళీలను భర్తీ చేయాలి. ఆయుష్ సర్వీసు రూల్స్‌లో సవరణలు చేయాలి’అని సూచించారు.
వారిపై నివేదిక రూపొందించండి...
‘ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు.. ఏ పని చేస్తున్నారన్న అంశాలపై పూర్తి నివేదిక రూపొందించాలి. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైపెండ్‌గా ఇస్తున్నారు. వారి సేవలు వినియోగించుకునేలా విధివిధానాల రూపకల్పన చేయాలి.
తొలి నోటిఫికేషన్‌లో ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ మార్కులు, మిగతా 80 శాతం మార్కులు ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలి. తొలి విడత తర్వాత. వెంటనే స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి’అని హరీశ్ వివరించారు.
జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు
అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కంటి వైద్యులతో ఆయన జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులను ఆదేశించారు. తగిన పరికరాలు, సదుపాయాలున్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలన్నారు. దీని కోసం ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment