ఆమె అబార్షన్‌కు సుప్రీం ఓకే
అత్యాచార బాధితురాలి కేసులో.. 1971 నాటి అబార్షన్ చట్టం సడలింపు
న్యూఢిల్లీ : ముంబైకి చెందిన ఒక అత్యాచార బాధితురాలికి ఊరటనిచ్చేలా అబార్షన్ చట్టంలో సడలింపునిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గర్భంలోని 24 వారాల పిండం పరిస్థితి బాగాలేకపోవడం, దీనివల్ల తల్లి ప్రాణాలకే ముప్పు ఉండడంతో గర్భస్రావానికి సోమవారం అనుమతిచ్చింది. ఇటీవల బాధితురాలి పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై జూలై 22న ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ కాలేజీకి చెందిన మెడికల్ బోర్డు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసింది.
అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణ రీతిలో ఉందని, అది అలాగే కొనసాగితే ఆమె శారీరక, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కమిటీ కోర్టుకు నివేదించింది. దీన్ని ప్రాతిపదికగా తీసుకున్న జస్టిస్ జేఎస్ కెహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. బాధితురాలి అబార్షన్‌కు అనుమతిచ్చింది. వాస్తవానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్రెన్సీ చట్టం 1971లోని సెక్షన్ 3 ప్రకారం 20 వారాలలోపు మాత్రమే అబార్షన్‌కు అనుమతి ఉంది. కానీ ఈ కేసులో గర్భస్రావం చేయకపోతే తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆ చట్టం వర్తించదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన కోర్టు 1971 చట్టానికి వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొంది. అలాగే బాధితురాలి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పునిచ్చింది.