సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్‌ను ఎందుకు నియమించారో తనకు తెలియదని మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌ఓటీ) సబ్ ఇన్‌స్పెక్టర్ షేక్ లాల్ మదార్ అన్నారు. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరిస్తే సిర్పుర్కర్ కమిషన్ నియమించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని కమిషన్ అడగ్గా, ఏమో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు.
నిందితులను కోర్టులో హాజరు పరిచి, న్యాయపరంగా శిక్షిస్తే పోలీసులకు కీర్తి వచ్చేది కదా అని ప్రశ్నించగా.. తనకు తెలియదని పేర్కొన్నారు. ముద్దాయిల అరెస్టును ప్రజలు హర్షించారా అని అడగగా.. తనకు తెలియదని చెప్పారు. సిర్పుర్కర్ కమిషన్‌కు గురువారం లాల్‌మదార్ ఇచ్చిన వాంగ్మూలాలలో కీలకమైన అంశాలివీ..
లాంగ్ రేంజ్ వెపన్ ఎక్కడిది?
‘దిశ’సంఘటన సమయంలో మీరు సబ్ ఇన్‌స్పెక్టర్ కదా మరి లాంగ్ రేంజ్ (షోల్డర్) వెపన్ ఎలా ఉందని కమిషన్ ప్రశ్నించగా.. ‘‘దిశ సంఘటన కంటే రెండు రోజుల ముందు (2019 డిసెంబర్ 4) నేను నార్సింగి ఎస్‌ఓటీలో రిపోర్ట్ చేశాను. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి.. ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నన్ను లాంగ్ వెపన్ తీసుకురమ్మన్నారు’అని నాతో చెప్పాడు. నాతో పాటు వచ్చిన ఐదుగురు పోలీసులు ఆయుధాలు తీసుకోగా.. అక్కడ మిగిలింది ఏకే–47 ఒక్కటే. అందుకు అదే తీసుకున్నాను’’అని వివరించారు.
ఎవరెవరు ఏ తుపాకులు తీసుకున్నారని ప్రశ్నించగా.. నాతో పాటు ఎస్‌ఐ బాలరాజు ఏకే–47 తీసుకోగా.. ఎస్.సుమన్, రవి, హెడ్ కానిస్టేబుల్ బండయ్య, సిరాజుద్దీన్ నలుగురు ఎస్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారని తెలిపారు. విధి నిర్వహణలో తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఏకే–47 వినియోగించలేదని పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్సీ వాళ్లు ఒత్తిడి చేశారు..
దిశ ఎన్‌కౌంటర్‌పై విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం ఆమన్‌గల్ ఎస్‌హెచ్‌వో కొండా నరసింహారెడ్డి లాగే తనను కూడా ఒత్తిడి చేసిందని త్రిసభ్య కమిటీకి వాంగ్మూలం ఇచ్చారు. నిందితులు ఎక్కడున్నారు? ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఎస్కార్ట్ పోలీసులు ఏ పొజిషన్‌లో ఉన్నారు?
పంచ్ విట్నెస్‌లు ఎక్కడున్నారు.. ఇలా ఘటనకు సంబంధించిన అన్ని స్కెచ్‌లను ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులే గీశారని, పైగా వాళ్లు చెప్పిన చోటే మార్కింగ్, సంతకాలు చేయాలని బలవంతం చేశారని వివరించారు. తాను నిరాకరించడంతో 9 గంటల పాటు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. దీని గురించి ఏసీపీ సురేందర్‌కు మాత్రం మౌఖికంగా తెలిపానని చెప్పారు.
ఎన్‌కౌంటర్ మీ ఉద్దేశం కాకపోతే..
నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం పోలీసులు ఉద్దేశం కాకపోతే ముద్దాయిల నడుము కింది భాగంలో కాల్పులు జరపాలి కదా అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ముందుగా నిందితులే ఫైరింగ్ ప్రారంభించారని, దీంతో వాళ్ల మైండ్ డైవర్ట్ చేయడానికి శబ్దం వచ్చిన వైపు ఎదురు కాల్పులు జరిపానని తెలిపారు. నిందితులు పోలీసుల తుపాకులు లాక్కొని ఎందుకు పరిగెత్తారని అడగగా.. తనకి తెలియదని చెప్పారు.
ఆరీఫ్ ముందుగా ఫైరింగ్ చేయగానే అక్కడు న్న పోలీసులందరూ అక్కడున్న రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న గట్టు కింది భాగం లో రక్షిత ప్రదేశంలోనే పడుకున్నారు కదా.. మరి మీరెందుకు నిందితుల నడుము పైభాగంలో కాల్పులు జరిపారని త్రిసభ్య కమిటీ ప్రశ్నిం చింది. నలుగురు నిందితులు పారిపోతున్న ప్రాంతం తమ కంటే ఎత్తులో ఉందని, దీంతో కాల్పులు మాకు తగిలే అవకాశం ఉండటంతో ఎదురు కాల్పులు చేశామని వివరించారు.
నా కళ్లల్లో కూడా మట్టి పడింది..
పారిపోయేందుకు ప్రయత్నించిన మహ్మద్ ఆరీఫ్‌ను.. అతడి వెనకాలే ఉన్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పట్టుకోవటానికి ప్రయత్నించలేదా? అని ప్రశ్నించగా.. హెడ్ కానిస్టేబుల్ జానకీరాం, ఎస్‌హెచ్‌వో నరసింహారెడ్డి కళ్లలో ఆరీఫ్ మట్టి విసరడంతో.. ఆ మట్టి తన కళ్లల్లోనూ పడిందని, దీంతో చూడలేకపోయానని సమాధానం ఇచ్చాడు. నిందితులు పారిపోతుండగా ఏసీపీ కాల్పులు జరపమని ఆదేశించగా.. 8–10 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపానని చెప్పారు.
కాల్పులు జరిపిన పోలీసుల సెల్‌ఫోన్లు తీసుకున్నారు..
2019 డిసెంబర్ 6న ఉదయం 7:59 నుంచి 8:02 గంటల వరకు చటాన్‌పల్లిలో ఉన్న మీ సెల్‌ఫోన్ నంబర్ టవర్ లొకేషన్ ఆ తర్వాత ఉదయం 9:49 నుంచి 11:55 గంటల మధ్య మహరాజ్‌పేట, సాయంత్రం 6:09 గంటలకు నార్సింగి, సాయంత్రం 6:11 గంటలకు గ్రేహౌండ్స్, 6:19 గంటలకు కొత్వాల్‌గూడలో ఆ తర్వాత శంషాబాద్‌లో ఎందుకు చూపించిందని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత తాము ఫోన్‌లో మాట్లాడుతున్నామని చెప్పి తనతో పాటు సిరాజుద్దీన్, రవి, నరసింహారెడ్డిల సెల్‌ఫోన్లను షాద్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ తీసుకున్నారని వివరించారు. తన ఫోన్‌కు లాక్ లేకపోవటంతో ఎవరైనా వినియోగించుకునే అవకాశముందని తెలిపారు. నేర నిరూపణలో సెల్‌ఫోన్ కీలకమని మీకు తెలియదా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment