సునంద మృతిపై చేతులెత్తేసిన మెడికల్ బోర్డు
న్యూఢిల్లీ:
కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతికి కారణం కనుగొనడంలో మెడికల్ బోర్డ్ చేతులెత్తేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ కనుగొన్న అంశాలను పరిశీలించిన బోర్డు సునంద మరణంపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని తెలియజేస్తూ ఈ కేసును అధ్యయనం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కు నివేదిక సమర్పించింది. సునంద మృతికి కారణం తెలియడంలేదంటూ నెలరోజులక్రితం మెడికల్ బోర్డు నివేదిక సమర్పించింది.
అయితే ఎఫ్‌బీఐ, ఎయిమ్స్ నివేదికల ఆధారంగా మరోసారి పరిశీలించాల్సిందిగా వారిని కోరాము అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. మెడికల్ బోర్డు చేతులెత్తేయడంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మొబైల్ ఫోన్ నుంచి డిలీటైన మెస్సేజ్‌లను తిరిగి తీసుకురావడం ద్వారా ఆమె ఎవరితో మాట్లాడిందో తెలిస్తే దర్యాప్తు కొంతవరకు ముందుకు తీసుకుపోవచ్చని భావిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో 2014 జనవరి 17 రాత్రి సునందా పుష్కర్ (51) అనుమానస్పదంగా మరణించిన విషయం తెలిసిందే.