
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణ నివేదిక వెలుగుచూస్తే శశిథరూర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలకు బదులు హత్య ఆరోపణలు మోపేవారని వ్యాఖ్యానించారు. శశి థరూర్ సహకారంతో సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు.
ఈ నివేదిక బయటకు వస్తే ఆయనపై కేవలం ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణల స్ధానంలో హత్య కేసు అభియోగాలు నమోదయ్యేవని స్వామి పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన తమ మాజీ సహోద్యోగులను కాపాడుకునేందుకు ఈ నివేదికలో అంశాలను బహిర్గతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు వెనుకాడుతున్నారన్నారు.
ఈ నివేదిక వెలుగుచూడాలని పోలీసులు కోరుకోవడం లేదని, ఏమైనా న్యాయమూర్తులు చివరకు ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. చార్జిషీట్‌లో సాక్ష్యాల తారుమారు నివేదికను ప్రస్తావించకుంటే పూర్తి విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ను ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా గుర్తించారు. కాగా శశిథరూర్ ఇల్లు పునర్మిర్మాణంలో ఉండటంతో థరూర్ దంపతులు హోటల్‌లో విడిది చేశారు.
Comments
Please login to add a commentAdd a comment