సాక్షి, హైదరాబాద్: ఈ దేశ పౌరులకోసం ప్రాణాలు లెక్క చేయకుండా శత్రుమూకల నుం చి సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని ఆదుకునేందుకు పౌరులు ముందుకు రాకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ సేవలో వీర మరణం పొందడమో, గాయపడటమో జరిగినప్పుడు ఆ సైనికుల సంక్షేమంకోసం తలా రూ.100 చొప్పున సాయం చేసినా ఆ సైనికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మన కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారిని ఆదుకోవడం కనీస సామాజిక బాధ్యతని తెలిపింది. పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి కుడికన్ను, కుడిచేయి, కుడికాలు పనిచేయని పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ)కి చెందిన సైనికుడు కంగాల శ్రీరాములుకు మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా సాయం అందచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంగాల శ్రీరాములు పరిస్థితిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ లేఖ రూపంలో శ్రీరాములు పరిస్థితిని అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీజే ఆ లేఖను పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించారు.
తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్ స్పందిస్తూ, శ్రీరాములు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మెడికల్ బోర్డు సమావేశం కానున్నదని తెలిపారు. బోర్డు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అతనికి అందే సాయం ఆధారపడి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారికి దక్కాల్సిన బీమా ప్రయోజనాలను అందచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఆ సైనికుల కుటుంబాలు ఎంతో క్షోభను అనుభవిస్తుంటాయని విచారం వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా శ్రీరాములకు సాయం చేయాలని, ఇందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ విచారణను డిసెంబర్ 4కి వాయిదా వేసింది.
సైనికులను ఆదుకోవడం కనీస బాధ్యత
Published Wed, Nov 21 2018 3:12 AM | Last Updated on Wed, Nov 21 2018 3:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment