
పుతిన్‌కు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్/మాస్కో: ‘‘పాపం ఉక్రెయిన్ సైనికులు! అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లను రష్యా సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. వారినింకా వేటాడితే సామూహిక హననానికి, రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి దారుణమైన రక్తపాతానికి దారితీస్తుంది. కనుక వాళ్లను చంపకండి. దయచేసి వదిలేయండి’’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా విజ్ఞప్తులివి! ఈ విషయమై పుతిన్‌తో ఫోన్ చర్చలు జరిపినట్టు శుక్రవారం ఆయన ప్రకటించారు. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి, భయానక రక్తపాతానికి అతి త్వరలో తెర పడుతుందని ఆశిస్తున్నా’’ అని తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో చెప్పుకొచ్చారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకరించడం, పుతిన్ కూడా సూత్రప్రాయంగా సరేననడం తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్వరం మార్చారు. కాల్పుల విరమణకు ముందు చర్చించుకుని తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘‘వాటిపై బహుశా అమెరికా, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తాం. ట్రంప్‌కు కూడా కాల్‌చేసి మాట్లాడతా’’ అని ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ మండిపడింది. కావాలనే శాంతిప్రక్రియకు మోకాలడ్డుతున్నారని ఆక్షేపించింది.
Comments
Please login to add a commentAdd a comment