
ఎక్స్‌లో దేశాధినేతల పోస్టులు
తగిన శాస్తి జరిగిందన్న రష్యా
జెలెన్‌స్కీని అవమానించారన్న కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి
ఆయనతో గొంతు కలిపిన సెనేటర్ రీడ్
న్యూయార్క్: అధ్యక్షుల రగడలో యూరప్‌తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి బాసటగా నిలిచాయి. దేశాధినేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ జెలెన్‌స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అద్దం పట్టింది. రష్యా మాత్రం జెలెన్‌స్కీకి తగిన శాస్తే జరిగిందంటూ ఎద్దేవా చేసింది.
‘‘అంతటి వాగ్యుద్ధంలోనూ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సంయమనం అభినందనీయం. జెలెన్‌స్కీని వాళ్లు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు. ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సెనేటర్ జాక్ రీడ్ తదితరులు మాత్రం ట్రంప్, వాన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
జెలెన్‌స్కీని కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎంతగా రష్యా వైపు, పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్‌కే దన్నుగా నిలుస్తారన్నారు. జెలెన్‌స్కీతో ట్రంప్, వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటని రీడ్ మండిపడ్డారు. తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయతనే దెబ్బతీశారని ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు.
ఆత్మగౌరవం ప్రదర్శించారు: ఉర్సులా
ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టేలా జెలెన్‌స్కీ ఆత్మగౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ కొనియాడారు. ‘‘నిర్భయంగా, ధైర్యంగా, బలంగా ఉండండి. మీరు ఒంటరి కారు. శాశ్వత శాంతి కోసం మేమంతా మీతో కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రష్యా ఒక దురాక్రమణదారు. ఉక్రెయిన్ బాధితురాలు. మేం ఆ దేశానికి సాయం చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు. అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, జపాన్ తదితరాలన్నీ ఇకముందూ ఇదే వైఖరి కొనసాగిస్తాయి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్య యత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం ఈయూ–అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు, జెలెన్‌స్కీకి మీకు తామంతా అన్నివేళలా వెన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది కాదనలేని వాస్తవమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. లాతి్వయా, ఎస్తోనియా, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, పోలండ్, హాలండ్ తదితర దేశాధినేతలు కూడా జెలెన్‌స్కీకి మద్దతుగా పోస్టులు చేశారు.
మూడో ప్రపంచయుద్ధానికి బాటలు...
‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పాటుపడతారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవించని వాళ్లు మానుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నటికీ అనుమతించబోరు. జెలెన్‌స్కీతో భేటీలో ట్రంప్ మాటతీరే ఇందుకు తాజా నిదర్శనం. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రేనియన్లలో ఏకంగా 52 శాతం మంది కోరుతున్నట్టు గత నవంబర్లో జరిగిన సర్వే తేల్చింది. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అది ఉక్రెయిన్లో మొదలవుతుంది. ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాకుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది’’
– వైట్‌హౌస్ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment