బ్రోకర్లకు బిగుస్తున్న ఉచ్చు
మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో నిలదీస్తున్న బాధితులు
డబ్బుల కోసం పెరుగుతున్న ఒత్తిడి
తప్పించు కుతిరుగుతున్న దళారులు
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : మెడికల్ అన్‌ఫిట్‌లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మెడికల్ బోర్డు నిర్వహించిన ప్రతీసారి డబ్బులతో పండుగ చేసుకొనే బ్రోకర్ల పరిస్థితి కుడితిల పడిన ఎలుకల తీరుగా మారింది. జబ్బు పడిన వారి నుంచే కాకుండా దొంగ మెడికల్ అన్‌ఫిట్ కేసులు చేయించడానికి రూ.లక్షల్లో దండుకున్న దళారులకు డబ్బులిచ్చిన కార్మికుల నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రేపు.. మాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. మరి కొందరైతే ముఖం చూపించుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ప్రకృతికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భం నుంచి బొగ్గు వెలికితీస్తున్న కార్మిక కుటుంబాలకు మేలు చేయడానికి యాజమాన్యం కల్పించిన అవకాశం నేడు దళారులకు, కొందరు నాయకులకు వరంగా మారిపోయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక విధులు నిర్వర్థించలేని కార్మికుడికి మెడికల్ బోర్డు అన్‌ఫిట్ సర్టిఫికెట్ ఇస్తే అతడి స్థానంలో వారసుడికి సంస్థ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు, నాయకులు బోర్డులోని అధికారులను మచ్చి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకున్నా అన్‌ఫిట్ చేయిస్తామని ఒక్కో కేసుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో వాస్తవంగా అనారోగ్యంతో ఉన్న కార్మికుల నుంచి సైతం త్వరగా అన్‌ఫిట్ చేయిస్తామని డబ్బులు దండుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మందికి పైగానే బ్రోకర్లు ఉన్నారని అంచనా. ఇందులో పలు సంఘాల నేతలు, ఉద్యోగులు, కొందరు అధికారులు, వైద్యుల పాత్రు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే మెడికల్ బోర్డులో అక్రమాలపై దుమారం రేగడంతో ఆగస్టు నుంచి మెడికల్ అన్‌ఫిట్లు ఆగిపోయాయి. ఎప్పుడు మెడికల్ బోర్డు పెడుతారో తెలియకపోవడంతో బ్రోకర్లకు డబ్బులిచ్చిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్రోకర్ల వెంబడి పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వారి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
దీంతో కొందరు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో లేడని చెప్పి తప్పించుకుంటున్నారు. కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అలాంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.