సాక్షి, గుంటూరు : ఎందరో గొప్ప వైద్యులను తయారు చేసిన గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)కి పూర్వ వైభవం రానుందా.. రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరు నగరంలో ఉన్న ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)కు మహర్దశ పట్టనుందా.. అనే ప్రశ్నలకు ఉన్నతస్థాయి వైద్య వర్గాలు అవునంటున్నాయి. ఇప్పటి వరకూ 150 సీట్లకే సరైన భవన సముదాయాలు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడంతో భారత వైద్యమండలి తనిఖీలు చేసినప్పుడల్లా అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల పరిస్థితి మెరుగుపడిందని గుర్తించిన భారత వైద్య మండలి బృందం ఇటీవల గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 200 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని భారత వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు.
గుంటూరు వైద్యకళాశాలకు 250 సీట్లు మంజూరు చేయాలంటే జీజీహెచ్, జీఎమ్‌సీల్లో నూతనభవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలుకు సుమారుగా రూ.300 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఏపీఎమ్‌ఎస్‌ఐడీసీకి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. 250 సీట్లు మంజూరు చేయాలంటే భారత వైద్య మండలి నిబంధనల మేరకు ఎలాంటి భవనాలు నిర్మించాలి, సౌకర్యాలను ఏమేరకు మెరుగుపర్చాలి, కావాల్సిన వైద్య పరికరాలు వంటి వాటిపై మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన భార్గవ్ అసోసియేట్స్ కంపెనీకి అప్పగించారు.
వైద్య కళాశాలలో శిథిలావస్థకు చేరిన రీజనల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ విభాగాల భవనాలను కూల్చి వాటి స్థానంలో ఐదు అంతస్తులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనాలు నిర్మించేందుకు బార్గవ్ అసోసియేట్‌కు చెందిన ఇంజినీర్ల బృందం వైద్య కళాశాలకు వచ్చి పరిశీలించారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో మెడికల్ స్టోర్స్ విభాగం, లాండ్రి, మోడ్రన్ కిచెన్, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, కాలినగాయలవారికి ప్రత్యేకవార్డు, బ్లడ్‌బ్యాంక్, కాన్పుల విభాగం, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, నర్సుల క్వార్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్ క్వార్టర్స్ తదితర విభాగాలను నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు వైద్య కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులతో కళాశాల అధికారులు సమావేశమై దీనిపై చర్చించనున్నారు.
జీఎంసీకి పూర్వ వైభవం
Published Sat, Jun 20 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement
Advertisement