సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం..
చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి..
అవయవాలు ఉన్నా.. అమర్చలేక..
ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు.
ఏ రక్తం వారికి.. ఎలా?
సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్‌లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్‌లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్‌లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు.
►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్‌లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి.
►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్‌పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది.
కృత్రిమ పరికరంలో అమర్చి..
సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్‌పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు.
మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో..
‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్‌పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్‌పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు.
►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్‌పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు.
►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే.
‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా..
ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు.
ఏడాదిన్నరలో మనుషులపై..
యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
రక్తం కొరత ఉండనట్టే..
రక్తం నుంచి యాంటీజెన్‌లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్‌లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment