![why your coffee too bitter scientists explain genetics and roasting affects](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/3/coffee_0.jpg.webp?itok=28HIycgD)
ఉదయాన్నే కమ్మని ఫిల్టర్ కాఫీ తాగితే మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది మనలో చాలామందికి. ఘుమఘుమలాడే కాఫీ వాసన ముక్కు పుటాలకు తగలగానే అదొక మధురానుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారు. అయితే మరికొంతమందికి అబ్బా..ఆ చేదు ఎలా తాగుతార్రా బాబూ! అనిపిస్తుంది కదా. అసలు కాఫీ ఎందుకు చేదుగా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? కాఫీలోని కెఫిన్ ఉండటం వల్లే చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ కెఫిన్ లేని కాఫీ కూడా చేదుగా ఉంటుందట. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగో ఈ వివరాలు మీకోసం.
మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీలోని లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫుడ్ సిస్టమ్స్ బయాలజీ పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించారు. రోస్ట్ చేసిన అరబిక్ కాఫీలో చేదు సమ్మేళనాల కొత్త సమూహాన్ని గుర్తించారు. చేదును అవి ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించారు. అలాగే ఈ వేయించే పదార్థాలు ఎంత చేదుగా ఉంటాయో నిర్ణయించడంలో వ్యక్తిగత జన్యు సిద్ధత కూడా పాత్ర పోషిస్తుందని వారు మొదటిసారి ప్రదర్శించారు.
అరబికా బీన్స్‌లో ఉండే ‘మోజాంబియోసైడ్‘ అసలైన కారణమట. ఇది కెఫిన్ కంటే పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది. మానవ శరీరంలో కనిపించే సుమారు 25 చేదు రుచి గ్రాహక రకాల్లో రెండు, అవి TAS2R43, TAS2R46 గ్రాహకాలు. వీటిని ఇది బాగా యాక్టివేట్ చేస్తుంది. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కూడా కాల్చి పొడి చేస్తారు. అయితే ఈ గింజలను రోస్ట్ చేసే ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఒక్కో దశలో ఒక్కో రుచి వస్తుందని పరిశోధకుడు లాంగ్ చెప్పారు. రుచి, దాని సున్నితత్వం అనేవి జన్యు సిద్ధతపై ఆధారపడి ఉంటుందని ఒక జన్యు పరీక్షలో వెల్లడైంది.
చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
మోజాంబియోసైడ్ పదార్థం ఉన్న కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ తాగిన పదకొండు మందిలో ఎనిమిది మందికి ఎక్కువ చేదుగా రుచిని గ్రహించడానికి మోజాంబియోసైడ్ దారితీసిందని ఒక పరీక్షలో తేలింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు.
అయితే తమ కొత్త పరిశోధనలు కాఫీ రుచిని వేయించే ప్రక్రియ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మన అవగాహనను పెంచుతాయని మరింత సమన్వయంతో కూడిన కొత్త కాఫీ రకాల అభివృద్ధికి దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు. చేదు పదార్థాలు ,వాటి గ్రాహకాలు శరీరంలోని ఇతర అంశాలను బట్టి ఉంటుందనీ, వీటిలో చాలా వరకు ఇప్పటికీ తెలియని పరిశోధకులు తెలిపింది. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని లాంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment