University of Toronto
-
ఎవరివైనా.. ఎవరికైనా.. అవయవాలు అందరికీ..
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి.. అవయవాలు ఉన్నా.. అమర్చలేక.. ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు. ఏ రక్తం వారికి.. ఎలా? సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు. ►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి. ►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ పరికరంలో అమర్చి.. సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు. మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో.. ‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. ►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు. ►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే. ‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా.. ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు. ఏడాదిన్నరలో మనుషులపై.. యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం కొరత ఉండనట్టే.. రక్తం నుంచి యాంటీజెన్లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
ప్రపంచ జలాల్లోకి 5.30 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు
ఒట్టావా : ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నివారించేందుకు అటు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దీంతో చెరువులు, కుంటలు, నదులు, నదాలు, సరస్సులు, సముద్ర జలాలు ప్యాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రపంచ దేశాలు నెరవేర్చినప్పటికీ 2030వ సంవత్సరం నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతాయని ఓ కెనడా బృందం అంచనా వేసింది. ఇది 2005 సంవత్సరం నాటి ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏడింతలు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచ జలాల్లోకి ఏటా 2.40 నుంచి 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని అధ్యయనంలో తేలింది. (శుక్రుడి మీద జీవం: రష్యా సంచలన ప్రకటన) ప్లాస్టిక్ ఉత్పత్తులను తక్షణం సంపూర్ణంగా ఆపేయడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను నూటికి నూరు శాతం రీసైక్లింగ్ చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని అప్పుడే పరిస్థితి మెరగుపడుతుందని టొరాంటో యూనివర్శిటీకి చెందిన కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ హెచ్చరించారు. 2015లో ప్లాస్టిక్ వ్యర్థాల్తో 80 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్‌కు పనికి రానివని తేలిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సముద్ర తీర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏటా ఏరివేయడంలో ఎన్జీవో సంస్థల తరఫున కొన్ని లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటున్నారని, 2030 నాటికి కనీసం వంద కోట్ల మంది కార్యకర్తలు వ్యర్థాల ఏరివేతలో పాల్గొంటే తప్పా పరిస్థితి మెరగుపడే అవకాశమే లేదని ఆమె హెచ్చరించారు. -
మనసులో అనుకున్నది గీసేస్తుంది!
టొరెంటో: మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు. నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారంగా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పారు. మాట్లాడలేని వారి మనసులో ఏముందో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మరో భూమి.. మనకు దగ్గరలో!?
భూమిని పోలిన మరో గ్రహం ఉందా? అక్కడ జీవరాశి మనుగడ సాధ్యమేనా? మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది? అక్కడకు మనం వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్నలకు అవునని.. సమాధానం చెబుతున్నారు పరిశోధకులు. ఒట్టావా : భూమిని పోలిన మరో గ్రహాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉందని సైంటిస్టులు ప్రకటించారు. కొత్తగా గుర్తించిన ఈ గ్రహానికి కె2-18బీ అని సైంటిస్టులు నామకరణం చేశారు. భూమిని పోలిన ఈ గ్రహాన్ని కెనడాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో పరిశోధకులు సంయుక్తంగా గుర్తించారు. తాజాగా గుర్తించిన ఈ గ్రహంపై మంచుతో కూడిన రాళ్లు, పర్వతాలతో ఉందని ఉంటుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన రేయాన్ క్లుటీర్ తెలిపారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్ఓ) డేటాను విశ్లేషించే క్రమంలో ఈ గ్రహం గురించిన సమాచారం తెలిసిందని ఆయన తెలిపారు. కే2-18బీ గ్రహం ఇంచుమించుగా నెఫ్ట్యూన్ గ్రహాన్ని పోలి ఉంటుందని రేయాన్ చెప్పారు. ద్రవ్యరాశి గురించిన సమాచారం లేదన్న ఆయన.. సూర్యుడి (అక్కడి పాలపుంతలో ఉండే నక్షత్రం) చుట్టూ తిరిగేందుకు 32.9 రోజుల సమయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ గ్రహం గురించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఐడియాలు రావాలంటే చేతులు కడుక్కోవాలట!!
టోరంటో: తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి? శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగిపోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా? శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోవడమే కాకుండా పాత ఆలోచనలు దూరమై, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు. కెనడాకు చెందిన యూనివర్సిటి ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చేతులు కడుక్కున్న వెంటనే పాత నిర్ణయాలను పక్కకునెట్టి కొత్త లక్ష్యాలకోసం మన మెదడు ఫ్రెష్‌గా ఆలోచిస్తుందంటున్నారు. పరిశోధనలో భాగం గా కొంతమందిని ఎంపికచేసి, వారికి ప్రేరేపణ కలిగించే నాలుగురకాల పరీక్షలను నిర్వహించారు. అంతకుముందు ఎంపికచేసిన వారిలో కొందరిని చేతులు కడుక్కోమని చెప్పా రు. అలా చేతులు కడుక్కున్నవారు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారట. అందుకు కారణం.. వారిలో సానుకూల భావనలు పెరగడమేనని, అంతకు ముందున్న పాత ఆలోచనలు సమసిపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. -
గాడ్జెట్లతో గడిపితే మార్కులు అంతంత మాత్రమే
టొరంటో: వీడియో గేమ్స్, ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడిపే టీనేజీ కుర్రాళ్లకు మాథ్స్, ఇంగ్లిష్‌లలో తక్కువ మార్కులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం వివిధ గాడ్జెట్లతో గడపడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకుడు అమి ఫీన్ తెలిపారు. ఒకై వైపు టీవీ చూస్తూ ఫోన్ వాడడం లాంటి పనులు ఒకేసారి చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని ఫీన్ అన్నారు. 73 మంది టీనేజీ కుర్రాళ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ‘పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులు సగటున వారానికి 12 గంటలు టీవీ చూసినా, వారంలో 25 శాతం సమయాన్ని ఫోన్లు, వీడియోగేమ్స్‌తో గడిపేవారు. మిగతా వారికంటే ఈ విద్యార్థులకు పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయ’ని ఫీన్ పేర్కొన్నారు. ఈ వివరాలు స్ప్రింగర్ సైకోనమిక్ బులిటెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అవయవాల సృష్టి ఇక ఈజీ
టోరంటో: హృదయ, కాలేయ కణజాలాల 3డీ మోడళ్లను యూనివర్సిటీ ఆఫ్ టోరంటో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకుగాను వారు ‘పర్సన్ ఆన్ ఏ చిప్’ టెక్నాలజీని వినియోగించారు. భవిష్యత్తులో నిజమైన మానవ అవయవాలను శరీరం వెలుపల వృద్ధిచేయడానికి ఉపయోగపడే టెక్నాలజీ ఇదే. పాడైన అవయవాలను బాగుచేయడానికి లేదా వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడానికి వీటిని వినియోగించే అవకాశముంది. తాము రూపొందించిన హృదయ, కాలేయ కణజాల 3డీ నమూనాలు అసలైన అవయవాల మాదిరిగానే పనిచేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ టోరంటో ప్రొఫెసర్ మిలికా రాడిసిక్ తెలిపారు. తమ లాబొరేటరీలో మరిన్ని మానవ కణజాలాలను అభివృద్ధి చేసే యత్నాల్లో ఉన్నామని చెప్పారు. -
మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారు
టొరెంటో వర్సిటీ ప్రొఫెసర్ ఎంజెలా మిల్స్ హెచ్‌సీయూలో ముగిసిన ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్ హైదరాబాద్: పురుషాధిక్య ధోరణి వల్ల మహిళలు భావ స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారని టొరెంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంజెలా మిల్స్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న 12వ ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్ బుధవారం ముగిసింది. ఈ సందర్బంగా జరిగిన ము గింపు సమావేశంలో ఎంజెలా మాట్లాడుతూ.. మహిళల భావ స్వాతంత్య్ర హక్కును సమాజం నొక్కిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా మహిళల స్వాతంత్య్రం ఎండమావిగానే మిగిలిపోయిందన్నారు. విద్య ద్వారానే మార్పు సాధ్యం కాదని, ఆలోచనలో మార్పుకోసం సామాజిక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ సాహిత్యంలో మహిళల పాత్రను తక్కువ చేసి చూపారని వారి విజయాలను సరైన రీతిలో నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న సాలిడారిటీ మార్చ్...: సదస్సు ముగిసిన అనంతరం 58 దేశాల ప్రతి నిధులు నిర్వహించిన సాలిడారిటీ మార్చ్ ఆకట్టుకుంది. మహిళ హక్కులు రక్షించాలి, అభివృద్ధికి బాటలు వేయాలి అంటూ వివిధ భాషల్లో మహిళలు నినదించారు. ఈ కార్యక్రమం లో సదస్సు డెరైక్టర్ ప్రొఫెసర్ రేఖా పాండే, డిప్యూటీ డెరైక్టర్ వి.సీత పాల్గొన్నారు.