సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. అవయవ మార్పిడిపై మాత్రం తీవ్ర ప్రభావం పడింది. నిత్యం రోగుల సంఖ్య పెరుగుతున్నా వారికి అవయవాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు నిలిచిపోయాయి. అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతిని తాత్కాలికంగా మందులతో నెట్టుకొస్తున్న బాధితులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జీవన్ దాన్‌లో 8,985 మంది పేర్లు నమోదు చేసుకోగా, వీరిలో అత్యధికంగా 4,526 మంది మూత్ర పిండాల కోసం, 4,073 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా
ప్రమాదాలు తగ్గి బ్రెయిన్ డెడ్స్ లేవు. నిజానికి మూత్రపిండాలు, కాలేయాలను లైవ్‌డోనర్ల నుంచి కూడా సేకరించే అవకాశం ఉన్నప్పటికీ.. బాధితుల కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు రాకపోవడంతో బాధితుల సంఖ్య పెరగడానికి మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే 2013 నుంచి 2021 జులై తొమ్మిది వరకు 872 మంది దాతలు 3,308 అవయవాలను దానం చేశారు. వీటితో 2,233 మందికి పునర్జన్మను ప్రసాదించారు.
43 ఆస్పత్రుల్లో.. 8,985 మంది బాధితులు..
కోవిడ్ కారణంగా సాధారణ చికిత్సలతో పాటు అవయవ మారి్పడి చికిత్సలను కూడా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇదే సమయంలో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లు లేకపోవడంతో అవయవాల కొరత ఏర్పడింది. ప్రస్తుతం జీవన్‌దాన్ నెట్‌వర్క్‌లోని 43 ఆస్పత్రుల్లో 8,985 మంది బాధితులు పేర్లు నమోదు చేసుకుని, అవయవ మారి్పడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వీరిలో ఇప్పటికే కొంత మంది మృతి చెందగా.. మరికొంత మంది ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు.
అవయవాల కోసం..
♦ జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 8,985
♦ కిడ్నీల కోసం నమోదు చేసుకున్నవారు 4,526
♦ కాలేయ చికిత్సల ఎదురుచూస్తున్న వారు 4,073
ఏ ఆస్పత్రిలో.. ఎంతమంది..?
♦ అపోలో-1494
♦ యశోద-1772
♦ నిమ్స్-1310
♦ కిమ్స్-1209
♦ గ్లోబల్-1371
♦ ఉస్మానియా-276
♦ కేర్-324
చిన్న వయసులోనే పెద్ద జబ్బులు
మారిన జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడానికి జన్యుపరమైన సమస్యలతో చాలామంది చిన్న వయసులోనే పెద్ద జబ్బులకు గురవుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడితే నయం అయ్యే జబ్బులను.. అవగాహన లేమికి నిర్లక్ష్యం తోడై వారి పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటి వరకు అవయవాలను దానం చేసిన దాతల్లో 70 శాతం మంది 50 ఏళ్లలోపు వారే. వీరంతా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, కొన ఊపిరితో ఆస్పత్రుల్లో చేరిన క్షతగాత్రులే.. అంతేకాదు అవయవాల కోసం అనేక మంది ఎదురు చూస్తుండగా, వీరిలో 50 ఏళ్లలోపు వారు 4,491 మంది ఉండగా, ఆపై వయసు్కలు 4,494 మంది ఉండటం గమనార్హం.
ఊపిరితిత్తుల కోసం కిమ్స్‌లో..
ఉత్తరప్రదేశ్ లక్నోలోని రామ్‌మనోహార్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఆర్‌ఎంఎల్‌ఐఎంఎస్)కు చెందిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శారదా సుమన్‌కు ఏప్రిల్ 14న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఆమెకు వెంటిలేటర్ అమర్చి మే 1న సిజేరియన్ చేసి, కడు పులోని బిడ్డను కాపాడారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎక్మోసపోర్ట్ అవసరమైంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను నాలుగు రోజుల క్రితం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో నగరానికి తరలించారు. ప్రస్తుతం ఆమె కిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తోంది.
దాతలు ముందుకు రావడం లేదు
అవయవ దానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ జన్మలో అవయవాలను దానం చేస్తే.. వచ్చే జన్మలో ఆ అవయవ లోపంతో జని్మస్తారని భావించి, అవయవ దానానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి అన్ని దానాల్లో కన్నా అవయవ దానం గొప్పది. బ్రెయిన్‌డెత్ స్థితిలో ఉన్న వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించొచ్చు. పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులను కాపాడాలంటే దాతలు కూడా అదే స్థాయిలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ ఏజీకే గోఖలే, గుండె మార్పిడి నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment