ఉచిత వైద్యమెక్కడ ?
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న వరాలు నోరూరిస్తున్నాయి. అందనంత ఎత్తులో ఉండి రారమ్మంటున్నాయి. చేతికి మాత్రం అందడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఉచిత వైద్యం. సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో అధిక శాతం ప్రజలు కూలీలే. వీరికి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందిస్తానంటూ హామీలు గుప్పించింది. భూములు సమీకరించిన ఏడాది అనంతరం ఉచిత విద్యపై జీవో విడుదల చేసింది. ఉచిత వైద్యం మీద మాత్రం ఎటువంటి సూచనలు చేయలేదు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పింది.
గతంలో ఉన్న ఆరోగ్యశ్రీనే ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంగా మార్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందిన వైద్యం ఇప్పుడు ఎక్కడా అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో రైతులు వ్యవసాయం చేసే సమయంలో 29 గ్రామాల్లో 9 వేల మందికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం అందినట్టు ప్రభుత్వ వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద రాజధాని ప్రాంతంలో ఒక్కరి నాడీ పట్టిన దాఖలాలు మాత్రం లేవు.
సరైన వైద్యశాల లేదు
తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో సరైన వైద్యశాలే లేదు. ఈ నేపథ్యంలో ఉచిత వైద్యం ఎంతమేర అందుతుందోనని బాధితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉచిత వైద్యం ఎక్కడ చేయించుకోవాలి, ఏ అధికారిని సంప్రదించాలి, అనారోగ్యం వచ్చిన వారి వివరాలు ఎవరు సేకరిస్తారు? ఎవరి ద్వారా చికిత్స పొందవచ్చు అనే అంశాలపై స్పష్టత లేదు. సీఆర్‌డీఏ అధికారులు కానీ, ఇతర శాఖలవారుగానీ దీనిపై సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెల్లకార్డు ఉన్న వారికి కొన్ని జబ్బులకే వైద్యం అందిస్తున్న ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంత వాసులకు ఉచిత వైద్యం అనే ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు
రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల నుంచి భూములు తీసుకుని ఏడాది కావస్తున్నా నేటికీ విద్య, వైద్యంపై నిర్ణయం తీసుకోలేదు. రాజధాని నిర్మాణంతో రైతుల బిడ్డలు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. 29 గ్రామాల్లో అన్నదాతల పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే అరకొర లబ్ధి వారి హాస్టల్ ఖర్చుకు కూడా రాదు.
- ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి
ఇదంతా ప్రభుత్వ కుట్ర
రాజధానిలో ప్రభుత్వ అరాచకాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు హామీల వర్షం కురిపించింది. భూములు ప్రభుత్వం చేతికి వచ్చిన తరువాత వారి గురించి ఆలోచించడమే మానేసింది. భవిష్యత్తులో భూములిచ్చిన రైతులు రాజధానిలో ఉండకూడదనే లక్ష్యంతో విద్య, వైద్యం అందుబాటులో లేకుండా ప్రభుత్వ కుట్ర పన్నుతోంది.
- ఎం రవి, సీపీఎం రాజధాని ప్రాంత కమిటీ సభ్యుడు