సాక్షి, సిటీబ్యూరో: ‘పులి రాజా...’ వచ్చే మార్గం మారింది. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కుల ద్వారా ఎయిడ్స్ ఎక్కువగా వ్యాపిస్తుందని చాలా మంది భావిస్తుంటారు కానీ...ప్రస్తుతం ఆయా వర్గాల్లో హెచ్‌ఐవీ తగ్గుముఖం పట్టింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పురుషుల్లో హెచ్‌ఐవీ బాధితులు పెరిగినట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. లైంగిక సంబంధాల ద్వారా వచ్చిన దానికంటే...ఇతర మార్గాల్లో (కలుషిత రక్త మార్పిడి..ఒకరికి వాడిన సిరంజ్‌లు, షేవింగ్ బ్లేడ్లు మరొకరికి వాడటం) ఎయిడ్స్ బారినపడిన వారే అధికంగా ఉన్నట్లు తేలింది.
తప్పని చీదరింపులు.. చీత్కారాలు
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఐవీ రోగులకు ఆదరణ కరువైంది. చికిత్స కోసం వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఆర్‌టీ(యాంటి రెట్రల్ వైరల్ సెంటర్) వైద్య సిబ్బంది వారిని సూటి పోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చికిత్సకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తెలంగాణలో 1,80, 937 మంది పేర్లు నమోదు చేసుకోగా, ప్రస్తుతం వీరిలో 90,156 మంది ఆయా ఏఆర్‌టీ సెంటర్లలో చికిత్సలు పొందుతున్నారు. 71,651 మంది మందులు వాడుతున్నారు. మరో 37,732 మంది చికిత్సకు రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. అవమానాలు, వేధింపులు భరించలేక కొంత మంది ఇతర ఏఆర్‌టీ సెంటర్లకు బదిలీ చేయించుకుంటున్నారు.
బోధనాసుపత్రుల్లో కిట్స్ కొరత
బోధనాసుపత్రుల్లో ఎయిడ్స్ కిట్స్ సరఫరా అధ్వానంగా ఉంది. ప్రతి చిన్న వస్తువు రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నాపెద్ద కలిపి ప్రతి రోజు సగటున 200–250 వరకు, గాంధీలో 200పైగా చికిత్సలు జరుగుతుంటాయి. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజు సగటున 25–30, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో 60–70 ప్రసవాలు జరుగుతున్నాయి. చికిత్సలకు ముందు రోగ నిర్థారణలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ టెస్టు తప్పని సరి. ఆస్పత్రిలో కిట్స్ కొరత వల్ల వాటిని రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.150 వెచ్చిస్తున్నారు. చికిత్సల్లో కీలకమైన సర్జికల్ కిట్స్(సూది, దారం, బ్లేడ్, దూది, గ్లౌజు)లేక పోవడంతో రోగులే వీటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500–700 వరకు ఖర్చు అవుతోంది.
గర్భిణుల్లో తగ్గుముఖం
అక్వైర్డ్ ఇమ్యూనో డెఫీషియన్సీ సిండ్రోమ్(ఎయిడ్స్)నగరంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరంలోని 25 ఐసీటీసీ కేంద్రాల్లో ఇప్పటి వరకు సేకరించిన నమూనాలను పరిశీలిస్తే.. 2004–05లో 16.99 శాతం హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి.
2016 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 40395 మందికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయగా, వీరిలో 1024 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 34,861 మంది గర్భిణులను పరీక్షించగా, కేవలం 43 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 21587 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 39 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గర్భిణుల్లో హెచ్‌ఐవీ తగ్గుముఖం పట్టిందనడానికి ఇదో నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment