విజృంభిస్తున్న ఎయిడ్స్
* జిల్లాలో పెరుగుతున్న హెచ్‌ఐవీ బాధితులు
* ఇప్పటివరకు మొత్తం 3,012 మంది మృత్యువాత
* అవగాహన కార్యక్రమాలు అంతంతమాత్రమే
* బాధితులకు పింఛన్లు అందని వైనం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ రోగాలున్న వంద మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహిస్తే వారిలో ఆరుగురికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు ఉంటున్నారు.
అవగాహన లోపం, ఆరోగ్యంపై అశ్రద్ధతోనే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ సోకి ఇప్పటి వరకు 3,012 మంది చనిపోయారు. వీరిలో అధిక శాతం 40 లోపు వయసు వారు ఉండటం గమనార్హం. పలు వ్యాపారాలకు చిత్తూరు జిల్లా అనుకూలంగా ఉండటం, పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం కూడా ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్యుతు చెబుతున్నారు. జిల్లాలో ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 324 అభంశుభంతెలియని పిల్లలు దీని బారిన పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.
రెండేళ్లనుంచి నిధులు నిల్
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం నామమాత్రపు కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. ప్రధాన కూడళ్లలో ఎయిడ్స్ నియంత్రణపై సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఐసీటీసీ అండ్ డీఆర్‌పీసీయూ కేంద్రాలకు అరకొర నిధులిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రతినెలా ఖర్చుల నిమిత్తం రూ.18,000 ఈ సెంటర్లకు విడుదల చేయాల్సి ఉంటుంది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయడం లేదు. దీంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తమకు జీతాలే సరిగా రావడం లేదని ఇంకా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపట్టుతామని ప్రశ్నిస్తున్నారు.
పింఛన్లకు దూరం
జిల్లాలో సుమారుగా 17,326 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఇది అధికారికంగా ఏఆర్‌టీ కేంద్రాల్లో నమోదైన సంఖ్య. వీరికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరందరికి పింఛన్లు మంజూరు చేస్తోంది. అయితే గత మూడేళ్లలో పింఛన్ తీసుకున్న వారు ఐదు శాతం కంటే తక్కువే. సమాజం తమను చులకనగా చూస్తుందని రోగులు కూడా పింఛన్లకు దూరంగా ఉంటున్నారు.
గత మూడేళ్లలో జిల్లాలో హెచ్‌ఐవీ బాధితులకు అందుతున్న పింఛన్లు..
2013 ఏప్రిల్ వరకు 1,300
2014ఏప్రిల్ వరకు 2,144
2015 ఏప్రిల్ వరకు 2,215
అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం
ఎయిడ్స్‌నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కార్పొరేట్ కాలేజీల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు చెబుతాం. దీనిపై జిల్లా వ్యా ప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు ఇలాంటి వ్యాధులను అరికట్టలేం.
- డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, చిత్తూరు