రోగుల ప్రాణాలు.. గాల్లో దీపాలు!
రోగుల ప్రాణాలు.. గాల్లో దీపాలు!
Published Tue, Sep 13 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
* ఆంధ్రాలో వైరల్ లోడ్ మిషన్ లేక హెచ్‌ఐవీ బాధితుల అగచాట్లు
* పరీక్షల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిందే
* శరీరంలో హెచ్‌ఐవీ వైరస్ శాతం తెలియక ప్రాణాలు కోల్పోతున్న వైనం
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా హెచ్‌ఐవీ బాధితుల వైద్య పరీక్షల కోసం ఇక్కట్లు తప్పడం లేదు. వ్యాధి నిర్ధారణ పరికరం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం హైదరాబాదులోనే ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌ఐవీ బాధితులు వైద్య పరీక్షల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోలేక.. ఏ మందులు వాడాలో తెలీక పలువురు హెచ్‌ఐవీ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసరమైన వైద్య పరికరాన్ని ఏర్పాటు చేయటంలో శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితులు పడుతున్న ఇబ్బందులను పరిశీలిస్తే...
రోగులకు వ్యయప్రయాసలు...
హెచ్‌ఐవీ సోకిన బాధితునికి శరీరంలో హె^Œ ఐవీ వైరస్ శాతం ఎంత మేరకు ఉందనే విషయాన్ని వైరల్ లోడ్ మిషన్ ద్వారా తెలుసుకుని అందుకు అవసరమైన మందులను బాధితునికి సూచించాల్సి ఉంటుంది. దీనివల్ల వైరస్ పెరగకుండా నియంత్రణలో ఉండి హెచ్‌ఐవీ బాధితులకు అవకాశవాద జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా వైరల్ లోడ్ మిషన్ వైద్య పరికరం లేకపోవడంతో హెచ్‌ఐవీ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈ పరికరం ఉన్నప్పటికీ ఏడాది కాలంగా వీరు కూడా పరీక్షలు చేయకపోవడంతో చెన్నై, ముంబైలలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను వీరు ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరీక్షకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వ్యయం అవుతుండటంతో బాధితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపేద బాధితులు అంత ఖర్చు చేయలేక వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఇష్టానుసారంగా మందులు వాడుతుండటంతో వారిలో వైరస్ పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
ప్రాణాలు కోల్పోతున్న బాధితులు...
వైరల్ లోడ్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా, గుంటూరు జిల్లాలో 2,500 మంది హెచ్‌ఐవీ బాధితులు ఎదురు చూస్తున్నారు. ఏఆర్టీ మందులు వాడుతున్న హెచ్‌ఐవీ బాధితులకు ప్రతి ఆరు నెలలకూ ఒకసారి ఈ పరీక్ష చేయాల్సి ఉంటుంది. వైరల్ లోడ్ పరీక్ష అనంతరం ఏఆర్టీ ఫస్ట్ లైన్ మందులు వాడాలా లేక, సెకండ్ లైన్ మందులు వాడాలా అనేది వైద్యులు నిర్ధారించి మందులు ఇస్తారు. అలా నిర్ధారణ జరగకుండా ఇష్టానుసారంగా మందులు వాడటంతో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో హెచ్‌ఐవీ బాధితులు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైరల్ లోడ్ మిషన్ కొనుగోలు చేసి ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని హెచ్‌ఐవీ బాధితులు కోరుతున్నారు.
Advertisement
Advertisement