‘స్వయం ఉపాధి’కి దరఖాస్తుల వెల్లువ
సాక్షి. హైదరాబాద్: స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా, ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు కలుపుకుని 1.30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నాటికి బీసీ కార్పొరేషన్‌కు 1,03,000 దరఖాస్తులు, 10 బీసీ ఫెడరేషన్లకు 17 వేలు, ఎస్సీ కార్పొరేషన్‌కు 10,600, ఎస్టీ కార్పొరేషన్‌కు 6 వేల వరకు దరఖాస్తులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా 2015-16లో పథకాలకు రూ.లక్షకు 80 శాతం రాయితీ(సబ్సిడీ)తో, రూ.2 లక్షలకు 70 శాతం రాయితీ, రూ.10 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ(5 లక్షలకు మించ కుండా)తో రుణాలు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికలను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో రూ.లక్ష వరకు గరిష్ట రుణానికి 60 శాతం వరకు సబ్సిడీని ఇస్తుండగా, ప్రస్తుతం గరిష్ట రుణ సౌకర్యాన్ని రూ.10 లక్షల వరకు పెంచడం (60 శాతం సబ్సిడీ రూ.5 లక్షలు దాటకుండా)తో ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. బీసీ కార్పొరేషన్ 2015-16 లో 17 వేల మందికి, బీసీ ఫెడరేషన్ల ద్వారా దాదాపు 15 వేలమంది వరకు లబ్ధి చేకూరే అవకాశముంది. రూ.5-10 లక్షల మధ్య రుణం కోసం దాదాపు 40 వేల దరఖాస్తులురాగా వాటిలో 400 లోపే రుణాలు అందే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు రుణాలకు 20 వేలకుపైగా, రూ.2 లక్షల రుణాలకు 40 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యనిచ్చే రుణాలకు వచ్చే దరఖాస్తుల్లో అన్ని అర్హతలను పరిశీలించి, రుణానికి అర్హత పొందిన లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమ శాఖ ఉంది. కల్లుగీత ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇతరత్రా మరో నెలరోజుల ఆలస్యం కానుండగా, వారికి ఆ మేరకు సమయాన్ని ఇచ్చి కొత్త ఫెడరేషన్ కింద లబ్ధి చేకూర్చాలని బీసీ శాఖ నిర్ణయించింది.
దళారులను నమ్మి మోసపోవద్దు
ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని బీసీ కార్పొరేషన్, 11 ఫెడరేషన్ల ఎం.డి.మల్లయ్యభట్టు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా రుణాలిప్పిస్తామని, డబ్బులు అడిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.