దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. అంబేడ్కర్ చెప్పినట్టు ఈ అంతరాలను తొలగించకపోతే ప్రజ లలో అసంతృప్తి రగిలి ఉద్య మాలు వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్నది సంధికాలంగా భావించవచ్చు. అన్ని కులాలకు... ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను, అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఆలోచన గల దార్శనికుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. జాతి, కుల, మత భేదాలతో మనుగడ కోల్పోతున్న విలువల భవితను గుర్తించి, సమానత్వానికి దారులు వేసిన ధైర్యశాలి. సమాజంలో ఉన్నత వర్గాలు పొందుతున్న హక్కులన్నింటినీ... అలాగే అభివృద్ధి పథకాలను పేద ప్రజలందరికీ అందేలా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి.
సాహు మహరాజ్ వలె ఏపీ సీఎం జగన్ బలహీన వర్గాల ప్రజలకు సంపద, అధికారం, బడ్జెట్ కేటాయిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి 8 మంది మంత్రులకు మించలేదు. ఇప్పుడు అంతకు రెట్టింపుకు పైగా మంత్రులు, ఉప ముఖ్య మంత్రులూ బహుజనులే జగన్ మంత్రి వర్గంలో ఉండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.
మన కాలపు సాహు మహరాజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎందుకంటే గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే డా. అంబేడ్కర్ చదువుకొని భారత దేశానికి రాజ్యాంగ రూప కర్తగా మారారని గతం గుర్తు చేస్తున్నది. అలాగే ఒక బీసీ ఉద్యమకారుడు నిస్వార్థంగా 47 ఏళ్లుగా పేద కులాల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికై పోరాడుతున్న ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపి జగన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
వైసీపీ మూడు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజ కీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. అయితే తన పరిధి మేరకు జగన్ బహుజనులకు అధి కారంలో వాటా కల్పించడానికి నిజాయితీగా చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలనూ, కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటానూ బీసీలకు ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రా లకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ. 30 వేల కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటు చేయ డాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
దళిత, బహుజనులు రాజ్యాధికారంవైపు అడు గులు వేయాలనీ, అందుకోసం వారంతా సమైక్యంగా ఉండాలని అంబేడ్కర్ అన్నారు. కానీ, ఇక్కడ సీఎం జగన్, దళిత... బీసీ వర్గాలు ఎలాంటి పోరాటాలు చేయకుండానే అధికారంలో వాటా కల్పించారు. వారి సాధికారత కోసం పాటుపడుతున్నారు. ఇంతకంటే అంబేడ్కర్‌కు అర్పించే ఘన నివాళి ఏముంటుంది?
- మన్నారం నాగరాజు
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment