పూరి గుడిసె వద్ద పెండ్ర వీరన్న
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీతారామపురం సౌత్ గ్రామంలోకి వెళ్లి పెండ్ర వీరన్న ఉండేది ఎక్కడా? అని ఎవరైనా అడితే శివారున పూరిల్లు (తాటాకు గుడిసె) చూపిస్తారు. ఇందేంటి కార్పొరేషన్ చైర్మన్ తాటాకు ఇంట్లో అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అదే విషయాన్ని ఆయన్ను ప్రశ్నిస్తే.. ఇది వైఎస్ జగనన్న తీసుకొచ్చిన సామాజికవ విప్లవం అని గర్వంగా చెబుతున్నాడు.
అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార జాతులకు చెందిన మందుల (బీసీ–ఎ) కులంలో పుట్టిన తాను పూరి పాకలో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైన జీవనం గడిపేవాడు వీరన్న. పదో తరగతి మాత్రమే చదవినప్పటికీ సామాజిక చైతన్యం అలవర్చుకుని తమ జాతి మెరుగైన జీవనం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. దుర్భరమైన జీవనం గడిపే మందుల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే పోరాటానికి నాయకత్వం వహించేలా 2011 డిసెంబర్ 12న మందుల కులస్తుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
తమ లాంటి వారి బతుకుల్లో వెలుగు నింపుతారనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కలిసి తమ జాతి సమస్యలను వివరించానని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ తనను అత్యంత వెనుకబడిన వర్గాల (సంచార జాతులు)కు కార్పొరేషన్ చైర్మన్ చేశారని గర్వంగా చెప్పారు. పూరి గడిసెలో జీవనం సాగిస్తూ అట్టడుగు వర్గాల కష్టాలను స్వయంగా చూసిన తాను అయితేనే అత్యంత వెనుకబడిన వర్గాలకు అండదండగా ఉంటాననే నమ్మకంతో వైఎస్ జగన్ ఈ పదవి ఇచ్చారని, తనకే కాదు.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన అనేక మందిని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారని పెండ్ర వీరన్న గర్వంగా చెబుతున్నారు.
సామాజిక చైతన్య వీచికలుగా బీసీ కార్పొరేషన్‌లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త చరిత్రను సృష్టిస్తూ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు గతేడాది అక్టోబర్‌లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా కులాల పేర్లు చాలా మందికి తెలియదు. చాలా కులాలకు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి గుర్తింపే లేదు. అటువంటిది వాటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. దాదాపు 56 కార్పొరేషన్ ఛైర్మన్లు, 672 డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment