‘బీసీ’ సబ్సిడీ 80% | BC subsidy of 80% | Sakshi
Sakshi News home page

‘బీసీ’ సబ్సిడీ 80%

Published Wed, Sep 30 2015 12:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

BC subsidy of 80%

- కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల మార్గదర్శకాల జారీ
- రూ.లక్ష లోపు 80శాతం, రూ.1-2లక్షల వరకు 70శాతం
- రూ.2-10లక్షల వరకు 60 శాతం సబ్సిడీ

సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసే స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల్లో సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. రూ.లక్షలోపు రుణాలకు 80శాతం, రూ.లక్ష-2లక్షల వరకు 70శాతం, రూ.2-10 లక్షల వరకు 60శాతం (రూ.5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేయనుంది. యూనిట్ కాస్ట్ పరిమితిని కూడా గతంలో ఉన్న రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. ఇక బీసీ ఫెడరేషన్లకు ఆర్థిక సహాయాన్నీ భారీగా పెంచింది. సొసైటీల్లో ఒక్కో సభ్యుడికి రూ.లక్ష వరకు సబ్సిడీ, మరో రూ.లక్ష బ్యాంకు రుణంగా అందజేయనున్నారు. అంటే 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
 
విడివిడిగా కార్యాచరణ..
2015-16కు సంబంధించి స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలను పట్టణ ప్రాంతా ల్లో రాజీవ్ అభ్యుదయ యోజనగా, గ్రామీణ ప్రాంతాల్లో మార్జిన్ మనీ స్కీం పేరు మీద అమలుచేస్తారు. రూ.లక్షలోపు రుణానికి 80 శాతం, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణంపై 70 శాతం, రూ.2లక్షల నుంచి రూ.10 లక్షలలోపు రుణంపై 60 శాతం (రూ. 5లక్షలకు మించకుండా) సబ్సిడీ అందజేస్తారు. దీంతోపాటు మిగతా సొమ్మును బ్యాంకు నుంచి రుణంగా అందజేస్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2014-15 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యూనిట్‌కాస్ట్ రూ.లక్షకు మించకుండా 50 శాతం సబ్సిడీతో మాత్రమే రుణాలిచ్చారు. తాజాగా యూనిట్ కాస్ట్‌ను, సబ్సిడీని భారీగా పెంచారు. ఇక ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేం దుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షన్నరకు... పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ. 2లక్షలకు పెంచనున్నారు. ఇందుకు సంబంధించి విడిగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
 
11 బీసీ ఫెడరేషన్లకు..
బీసీశాఖ పరిధిలోని 11 బీసీ ఫెడరేషన్లకు 2015-16కుగాను సవరించిన కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. 2014-15 వరకు ఒక్కో సభ్యుడికి రూ.25 వేల చొప్పున 15 మంది ఉన్న సొసైటీకి గరిష్టంగా రూ.3.75 లక్షలు రుణం ఇచ్చేవారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక్కో సభ్యుడికి రూ.లక్ష సబ్సిడీ (50శాతం), రూ.లక్ష బ్యాంకు రుణం (50శాతం)గా ఇవ్వనున్నారు. మొత్తంగా 15 మంది సభ్యులున్న సొసైటీకి రూ. 30 లక్షలు (రూ.15 లక్షలు సబ్సిడీ, రూ.15 లక్షలు బ్యాంకు రుణం) అందిస్తారు. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు అందజేస్తారు.
 
త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకూ..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలపై కసరత్తు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందం నాలుగు నెలల కిందే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అన్ని వర్గాలకూ ఒకే రాయితీ విధానాన్ని అనుసరించాలని సూచించింది. అయితే తొలుత బీసీ శాఖకు సంబంధించి విధానాన్ని ప్రకటించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నూతన విధానం గతంలోనే సీఎం ఆమోదం పొందింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement