ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్న గృహిణులు
ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం
గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200 ఉన్నప్పుడు హామీ
నేడు ధర రూ.900కి తగ్గినప్పటికీ అమలు చేయడంలో కుట్ర పూరిత జాప్యం
ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2,700 చొప్పున 1.57 కోట్ల కుటుంబాలకు రూ.4,239 కోట్లు నష్టం
ఏవమ్మా దీపం ఇచ్చాను నేను. దీపం పెట్టాను మీకు జ్ఞాపకం ఉందా? చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని. ఇంటిలో వంట చేస్తే కళ్లలో నీళ్లు వచ్చేవి. కడుపు నిండా పొగపోయేది. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని ‘దీపం’ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు అందించిన పార్టీ తెలుగుదేశం. ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగి పోవడంతో మళ్లీ కట్టెల పొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. – మే 28న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభలో చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు సూపర్–6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీపై చంద్రబాబు మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు. ఇప్పుడు “సూపర్–6 చూస్తుంటే భయమేస్తోందం’టూ కుంటిసాకులు వెదుకుతున్నారు. రాష్ట్రంలో 1.57 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి 5–6 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తోంది.
ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.900గా ఉంది. ఈ లెక్కన ఏడాదికి పేద కుటుంబం సగటున రూ.1000 చొప్పున రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు గ్యాస్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు తమకు 3 ఉచిత సిలిండర్లు ఇస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావించారు.
తద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.2,700 మిగులుతుంది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి 1.57 కోట్ల కనెక్షన్లపై రూ.4,239 కోట్లు, ఐదేళ్లలో రూ.21 వేల కోట్లు వెచ్చించాలి. అయితే ఇప్పటి వరకు ఈ పథకం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోరు విప్పలేదు.
ఎగ్గొట్టడంపైనే బాబు దృష్టి
2019 ఎన్నికల ముందు వరకు రూ.800గా ఉన్న గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.400 సబ్సిడీ ఇచ్చేది. అలాంటింది 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి సబ్సిడీని పూర్తిగా తగ్గించేయడంతో పాటు సిలిండర్ ధర క్రమంగా రూ.1200కు పెంచేసింది. సబ్సిడీ రూపంలో రూ.15 మాత్రమే జమ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కార్ అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచాయి. తర్వాత 2024 ఎన్నికలకు ముందు కేంద్రం అదే గ్యాస్ ధరను రూ.900కు తగ్గించింది. అయినప్పటికీ చంద్రబాబు గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉన్నప్పుడు హామీ ఇచ్చారు.
ఆ రేటు తగ్గడంతో ఆనందంగా పథకాన్ని అమలు చేయాల్సిందిపోయి ఎగ్గొట్టడంపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.2.69 లక్షల కోట్లు, ఇతర సంక్షేమ పథకాల (నాన్–డీబీటీ) రూపంలో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. వీటన్నింటి ఫలితంగానే కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదలు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు.
ఫలితంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా కనిపించని ఆర్థిక స్థిరత్వం (రూరల్ సస్టైనబులిటీ) నాలుగేళ్లలోనే సాధ్యపడింది. కానీ, అధికార దాహంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో పేదల ఆర్థిక సూచీ స్థిరత్వాన్ని కోల్పోనుంది.
మహిళలను డీఫాల్టర్లు చేసిన బాబు
2014లో పొదుపు సంఘాల మహిళలకు చెందిన రూ.14,204 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లేదు పొమ్మన్నారు. ఫలితంగా మహిళలు బ్యాంకులకు రుణం చెల్లించలేక వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. ఆ రుణ భారం రూ.25,571 కోట్లకు చేరుకుంది. 18.36% సంఘాలు బ్యాంకుల వద్ద డిఫాల్టు అయ్యాయి.
అలాంటి సమయంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వైఎస్సార్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు వాళ్ల అప్పు మొత్తం చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. దేశంలో మొత్తం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో 30% ఏపీలో పొదుపు సంఘాలకే పంపిణీ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment