సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో బీసీ సంక్షేమ శాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణం తప్పనిసరి కాదని, ఆ నిర్ణయం లబ్ధిదారుకే వదిలేస్తున్నామని వెల్లడించిది. మొత్తం వ్యయాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరిస్తే సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల్లో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు 2018ృ19 వార్షిక సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణకు బీసీ కార్పొరేషన్‌తోపాటు 11 బీసీ ఫెడరేషన్లు ఉపక్రమించాయి.
ఆర్థిక సహకార సంస్థ (ఫైనాన్స్ కార్పొరేషన్) ఇచ్చే రాయితీలు ఇప్పటివరకు బ్యాంకులిచ్చే రుణాలతో ముడిపడి ఉండేవి. యూనిట్ ప్రారంభించాలనుకున్న లబ్ధిదారు ముందుగా కార్పొరేషన్‌కు రాయితీ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చాక రాయితీ డబ్బులు పోను మిగిలిన మొత్తానికి సమీప బ్యాంకులో రుణం పొందేందుకు అర్జీ పెట్టుకునేవారు. అక్కడ రుణం దొరికితేనే రాయితీ ఫలాలు అందేవి.. లేదంటే అంతే సంగతి. ఏళ్ల నాటి ఈ నిబంధనలకు సంక్షేమ శాఖ స్వస్తి పలికింది.
రూ. లక్షకు రూ.80 వేల రాయితీ
స్వయం ఉపాధి యూనిట్లపై బ్యాంకు రుణం పొందడం ఆషామాషీ కాదు. బ్యాంకు నిబంధనలు పాటిస్తేనే రుణం మంజూరవుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్నా బ్యాంకర్ల సహకారం లేకుంటే రుణ మంజూరు గగనమే. దీంతో రుణాలందక లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేయలేకపోతున్నారని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సొమ్ము మొత్తం లబ్ధిదారుడే భరిస్తే రాయితీ విడుదల చేసేందుకు సంక్షేమ శాఖ వెసులుబాటునిస్తోంది. రూ.లక్షతో ఏర్పాటు చేసే యూనిట్‌కు సర్కారు రూ.80 వేల రాయితీ ఇవ్వనున్నారు. రూ.2 లక్షలుంటే రూ.1.40 లక్షలు, రూ.5 లక్షలకు పైబడి ఉంటే 50 శాతం రాయితీ ఇస్తారు.
రూ.1,400 కోట్లు..!
మూడేళ్లుగా రాయితీలివ్వని బీసీ సంక్షేమ శాఖ.. ఈసారి భారీ ప్రణాళికతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఆ శాఖ.. ఈ నెల 21 వరకు గడువు విధించింది. అలాగే పెండిగ్‌లో ఉన్న దరఖాస్తులను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు ఈ సారి బడ్జెట్‌లో రూ.1,400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో లక్ష మందికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే వీలుంది. 2018ృ19 వార్షిక సంవత్సరం ప్రణాళికను బీసీ కార్పొరేషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే దరఖాస్తులు పరిశీలన మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment