గుంటూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాల్. చిత్రంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు
సాక్షి, అమరావతి/మంగళగిరి: బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్‌లు, డైరెక్టర్‌లను నియమించి సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో శుక్రవారం బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లను ఘనంగా సన్మానించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులను వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వేదికపైకి ఆహ్వానించగా ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు సభకు అధ్యక్షత వహించారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్‌ల చైర్మన్‌లకు, డైరెక్టర్‌లకు తిరుపతిలో ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. బీసీలకు ఆత్మస్థైర్యం కలిగించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బీసీల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ఏడాదిన్నర కాలంలోనే రూ.67 వేల కోట్లు అందించారన్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
ఎంపీలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు.. కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, మధుసూదన్ యాదవ్, కాపు రామచంద్రారెడ్డి, అదీప్‌రాజ్, విడదల రజని, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ శేషుబాబు, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు పూలే ఏ సమాజాన్ని అయితే ఆశించారో.. అదే సమాజ స్థాపన దిశలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తోడు చేసుకుని సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment