విదేశీ కార్యాలయాల ఏర్పాటుకు ఓకే
నిబంధనలను సరళీకరించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: విదేశీ సంస్థలు భారత్‌లో వ్యాపారం చేయడం మరింత మెరుగయ్యేలా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా విదేశీ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేసే బ్రాంచ్, లయజన్, ప్రాజెక్ట్ ఆఫీసుల ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలను సరళీకరించింది. రక్షణ, టెలికం, ప్రైవేట్ సెక్యూరిటీ, సమాచార, ప్రసార మినహా ఇతర రంగాల కంపెనీలకు అనుమతులను గతంలో ఆర్‌బీఐ ఇచ్చేదని, ఇప్పుడు కేటగిరి-వన్ బ్యాంకులకు ఈ ఆమోదాలను ఇచ్చే వెసులుబాటును అందిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేటగిరి-1 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, బంధన్ బ్యాంక్, దోహా బ్యాంక్ క్రెడిట్, సూసీ ఏజీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బార్‌క్లేస్ బ్యాంక్ పీఎల్‌సీ, అబుదాబి కమర్షియల్ బ్యాంక్ తదితర బ్యాంక్‌లున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్‌లను కాంట్రాక్టుగా పొందిన కంపెనీలు ఆర్‌బీఐ అనుమతి లేకుండానే బ్యాంక్ ఖాతా తెరవవచ్చని పేర్కొంది. రక్షణ, టెలికం, ప్రైవేట్ సెక్యూరిటీ, సమాచార, ప్రసార, తదితతర రంగాల కంపెనీలు మాత్రం బ్యాంక్ ఖాతా ప్రారంభానికి ఆర్‌బీఐ అనుమతి పొందాల్సిందేనని తెలిపింది.