
పెట్రోల్ బంకుల్లో బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఖాతాను ప్రారంభించొచ్చు. అలాగే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి ఉపయోగకరమైన సేవలను అందించడం సహా దేశంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.
‘‘దాదాపు 14,000కు పైగా ఉన్న హెచ్‌పీసీఎల్ పెట్రోలు బంకులన్నీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు బ్యాంకింగ్ పాయింట్లుగా వ్యవహరిస్తాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు వీటి వద్ద ఖాతాను ప్రారంభించటం, నగదు డిపాజిట్, విత్‌డ్రాయెల్స్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు’’ అని అలాగే బ్యాంక్ కస్టమర్లు వారి హ్యాండ్‌సెట్స్ సాయంతో డిజిటల్ పేమెంట్స్ ద్వారా హెచ్‌పీసీఎల్ స్టేషన్లలో ఫ్యూయెల్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.